కులాల రొచ్చు ఆంధ్రలోనే ఎక్కువ అని ఇప్పటి వరకూ అనుకుంటూ ఉంటాం. పాలన ఎలా ఉన్నా.. అభివృద్ధి ఉన్నా లేకపోయినా… కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ నేతలు నేరుగా కులం పేరుతో తిట్టుకోవడం కూడా ప్రారంభించారు. ఒకరు చౌదరి అంటే.. ఇంకొకరు నాయుడు అంటారు.. మరొకరు రెడ్డి అంటారు. ఇప్పుడు అంతా ఆ కుల రాజకీయం రోడ్డున పడింది. ఇది మెల్లగా వైరస్లాగా తెలంగాణకూ చేరుతోంది. తెలంగాణలోనూ కుల రాజకీయాలు ఉన్నాయి. అయితే అది ఇప్పటి వరకూ… సామాజిక న్యాయం కోణంలోనే ఉండేవి. ఇప్పుడు… ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నేరుగా కులాల గురించి చర్చించేసుకుంటున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణిదేవిని రంగంలోకి దింపారు. టీఆర్ఎస్ పోటీ చేయదని చివరి క్షణం వరకూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వాణి దేవిని రంగంలోకి దింపడంతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది. టీఆర్ఎస్ కుట్ర పూరితంగా బ్రాహ్మణ్ అభ్యర్థిపై బ్రాహ్మిణ్ అభ్యర్థిని రంగంలోకి దింపి.. ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోందని… బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఓ అభ్యర్థిగా ఉండే ఇలా కులాల ప్రకారం మాట్లాడటంతో సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. అయితే ఈ చర్చ కుల రాజకీయాలపై వ్యతిరేకతలా కాకుండా… ఒకరినొకరు దూషించుకోవడానికన్నట్లుగా మారిపోయింది.
మంత్రి కేటీఆర్ కూడా… సురభి వాణిదేవికి మద్దతుగా జరిగే సభల్లో … సందర్భం వచ్చినప్పుడల్లా.. తాము బ్రహ్మిణ్ సమాజానికి ఏం చేశామో చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ కు గురువులన్నా.. బ్రాహ్మణులన్నా ఎంతో ఇష్టమని చెబుతున్నారు. యాగాలు చేస్తూంటారన్నారు. ఇలా కులాల ప్రకారం విడిపోయి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం… తెలంగాణలో ఇదే మొదటి సారి అనుకోవచ్చు. గతంలో కుల సమీకరణాలు.. అంతర్గతంగానే చేసేవారు. కానీ ఇప్పుడు ఏపీలోలా బహిరంగం అయిపోయింది. అయితే్.. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంకా… కుల రాజకీయాలు… ఆయా సామాజికవర్గాల్ని సంతృప్తి పరిచే దిశగానే ఉన్నాయి… ఒక్క సామాజికవర్గం మీద ఇతరుల్ని రెచ్చగొట్టే రాజకీయాల దాకా ఇంకా వెళ్లలేదు. ఆ అవలక్షణం కూడా చేరితో.. తెలంగాణ రాజకీయాలు కూడా.. ఏపీలాగా మారిపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.