విద్యా వికాసాలు పెరిగే కొద్దీ ఏమిటీ కులతత్వాలు అనాగరీకం అనిపిస్తాయి. అదేసమయంలో అస్ధిత్వ ఉద్యమాల విస్తరణ వల్ల మనిషి ఆనుకునే గోడ కులమే అన్న భావం కూడా బలపడుతోంది. ఏకకాలంలో పెరుగుతున్న రెండు విరుద్ధ భావాల్లో సంక్లిష్టతతలను అర్ధం చేసుకోవాలంటే భారతీయ సమాజంలో సోషల్ ఇంజనీరింగ్ ను, ఆ వ్యవస్ధలో మానవవనరులకు పరస్పర ఆధారపూరితంగా బలమిచ్చిన వృత్తులను, ఆవృత్తులే కులాలైన పరిణామాలను గుర్తు చేసుకోవాలి.
పారిశ్రామిక విప్లవం వల్లా బ్రిటీష్ వారి పాలనా విధానాల వల్లా గ్రామీణవృత్తులు అంతరించిపోవడమో, రూపాంతరం చెందడమో జరిగాయ. అయితే ఆ మూలాలు జనజీవన విధానంలో పెనవేసుకుని కులాలుగా ఊడలు దిగాయి. కులాలు లేని భారతావనిని ఊహించుకోవడమే కష్టం. అందుకు ఐదువేల ఏళ్ళనాటి ఇతిహాసాల లోతులే మూలం.
స్వతంత్ర భారతదేశంలో ఇందిరాగాంధీ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు బ్యాంకు సృష్టించారు. బడుగు బలహీన వర్గాలైన ఎస్ సి, ఎస్ టి లు ఆమె కారణంగా కాంగ్రెస్ కి కొండంత అండ అయ్యారు. ఇతర వర్గాలు కులాల ఓట్లు చీలిపోయినా ఈ ఓట్లు సాలిడ్ గా పడేలా మలచగలగలిగిన ఇందిర వ్యూహం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు విజయాలు సాధించిపెట్టింది.
రెడ్లు ముఖ్యమంత్రులుగా బడుగు బలహీన వర్గాల , ప్రధాన బలంతో కాపుల సపోర్టుతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కెమిస్ట్రీ కుదిరింది. అగ్రవర్ణాల వారికి సమస్యలు లేవు. ఉన్నా చెప్పుకోలేని భేషజం వారిది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన బిసిలలో పెరుగుతున్నపుడు, ప్రత్యామ్నాయం లేని ఒక శూన్యం రాజకీయాలను ఆవరిస్తున్నపుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్ధాపించారు.
పుట్టుకతో ఎన్ టి ఆర్ కమ్మ కులస్ధుడైనప్పటికీ బీసీ పునాదులతో తెలుగుదేశం పార్టీకి బీజం వేశారు.
బీసీలంటే తెలుగుదేశం, టిడిపి అంటే బీసీలన్నది భారతదేశం మొత్తానికి తెలిసిన సత్యం. ఎన్టీఆర్ పుట్టడానికి కమ్మ అయినప్పటికీ, ఒకరకంగా ఆయన బడుగుజన బాంధవుడు. అప్పట్లో రెడ్ల పెత్తనం ఎక్కు వగా ఉండటం, ముఖ్యంగా సీమాంధ్రాలో కరణీకరణం వల్ల, తెలంగాణాలో పటేల్-పట్వారీ వ్యవస్థల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారు బిసిలే. ఎన్టీఆర్ బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇవ్వడంతో బీసీలు తెలుగుదేశాన్ని సొంతం అనుకున్నారు. తెలుగుదేశంలో అప్పటి పునాదుల వల్లే ఎన్ని సంక్షోభాలు వచ్చినా చెక్కుచెదరకుండా ఉండటానికి కారణం. సామూహికంగా ఉన్నత స్ధానాలకు ఎదిగిన అందుకే ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, కళావెంకట్రావు, దేవేందర్‌గౌడ్, అల్లాడి రాజ్‌కుమార్, శ్రీనివాసయాదవ్, దాడి వీరభద్రరావు, తమ్మినేని సీతారాం మొదలుగా గల ఎందరికో రాజకీయ జన్మ ఇచ్చిన, ఇస్తున్నందువల్లే తెలుగుదేశం బిసిల పార్టీగా పుట్టి పెరిగి బలపడింది.
సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక రాష్ట్రంలో కులాల కెమీస్ట్రీలో పెద్దకుదుపే వచ్చింది. కాంగ్రస్ లో వున్న కాపుపెద్దలు, తెలుగుదేశంలో వున్న కాపు పెద్దలు ప్రజారాజ్యంలో చేరారు. ఎన్ టి ఆర్ లా నేరుగా ముఖ్యమంత్రి అయిపోవచ్చని చిరంజీవి ఆశపడ్డారు. అయితే ఆయన కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అత్తెసర ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. స్వల్ప ఓట్లతేడాతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేక పోయారు. ఎన్ టి ఆర్ ను ప్రజలు కమ్మ నాయకుడిగా చూడలేదు. చిరంజీవిని కాపుల నాయకుడి గా ప్రజలు భావించారు. కాపుల అత్యుత్సాహమే ఇందుకు కారణం.
చిరంజీవిని ముఖ్యమంత్రి గాచేసుకోలేక పోయిన కాపులు తెలుగుదేశం ఓడిపోడానికి కారకులయ్యారన్న భావన వల్ల బిసిలకు కాపులకు రాజకీయదూరం మరింత పెరిగింది.
సొంతంగా అధికారంలోకి రాగల రాజకీయ అనుకూలతను కాపులు సాధించుకో లేకపోయారని చిరంజీవి లెక్కతేల్చేశారు. తెలంగాణాతో కలసి వున్న ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల పాలనకు కాపులు, బడుగబలహీనవర్గాలకు కెమిస్ట్రీ కుదిరి కాంగ్రెస్ కు అనుకూలమైన ఒక ఓటు బ్యాంకు ఏర్పడింది.
విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల బలం తగ్గింది. చిరంజీవి కారణంగా ఏపార్టీలో వున్నా ఒకటైన కాపులు ఆయన వైఫల్యం వల్ల రాజకీయంగా శూన్య స్ధితికి ముందున్నారు. భవిష్యత్తు వుంటుందో లేదో తెలియని కాంగ్రెస్ తో ప్రయాణించగల పరిస్ధితి ప్రస్తుతానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సర్ధుకుపోతున్న దశలో పవన్ కల్యాణ్ కారణంగా ముఖ్యంగా కాపు యువకులు తెలుగుదేశం బిజెపి కూటమికి ఓటు ఇచ్చారు. ఈ పరిమాణం తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ముఖ్యకారణమైంది. బిసిలకు కాపులకు మధ్య సానుకూల వాతావరణం కుదరడానికి ఇది ఒక మలుపు.
అయితే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తూండటం, ఈ రిజర్వేషన్ ను అంగీకరించే ప్రసక్తే లేదని, కాపులు కావాలో బిసిలు కావాలో తెలుగుదేశం తేల్చుకోవాలని బిసి నేతలు స్పష్టం చేయడంతో కేస్ట్ పోలరైజేషన్ లేదా సామాజిక శక్తుల సహజ పునరేకీకరణకు అవరోధం ఏర్పడింది.
చంద్రబాబు తప్పుచేశారా? ముద్రగడ గెలుపొందారా అని? చర్చించడం ఈ విశ్లేషణ ఉద్దేశం కాదు. ఈ ఇద్దరికంటే రెండు సామాజిక వర్గాలు, శక్తుల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమైనవి. సుదీర్ఘకాలం మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయగిగినంత బలీయమైనవి…లోతైనవీ…
బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి అధికారంలో ఇపుడు లేకపోవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్ లో సోషల్ ఇంజనీరింగ్ ను మార్చి దళితులు, బ్రాహ్మణులు, ముస్లిం ల కాంబినేషన్ ను రాజకీయశక్తిగా మార్చి అధికారంలోకి వచ్చిన మాయావతి భారతదేశంలో కుల, రాజకీయాల లోతు చూసిన విజనరీ, మార్గదర్శి. ఒకసారి కలసి ప్రయాణం చేసిన కులాలు మతాల మధ్య ఎప్పటికైనా సామరస్యం కుదిరే అవకాశం వుంటుంది. కనీసం ఇప్పటికి విద్వేషం తలఎత్తదన్న గ్యారెంటీ వుంటుంది. ఆ సమీకరణమే మాయావతికి ముఖ్యమంత్రి పదవిని బహుకరించింది. మాయావతి నిర్మించిన అదే సమీకరణం సమాజానికి ఒక సామరస్యాన్ని బహుకరించింది
ముద్రగడ కాని, చంద్రబాబు కాని సమాజం పట్ల విశాలమైన, దీర్ఘకాలిక దృష్టి వున్నవారు కాదు. వారు అంతలోతైన వారు కానే కాదు!