బ్రిటీష్ వారి విభజించు-పాలించు సిద్ధాంతాన్ని ఇకపైన పుస్తకాల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకులు వాళ్ళను మించిపోతున్నారు? భారతదేశం నుంచి రాష్ట్రాలను, రాష్ట్రాల నుంచి ప్రాంతాలను విభజించుకుంటూ పోతున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణా…ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రాంతాల పేరు చెప్పి సాటి భారతీయులనే దూషిస్తున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. మరోవైపు మతాలు, కులాల పేరుతో ప్రజల మధ్య ద్వేషాగ్నిని రగిలించడంలో మన నాయకులు ఎప్పుడో ఆరితేరిపోయారు.
ఒక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కి ఏ స్థాయి గౌరవం ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రజల కోసం చట్టాలు చేసే సభకు తండ్రిలాంటి వ్యక్తి స్పీకర్. అలాంటి వ్యక్తి కులం గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. పదేళ్ళుగా మన కులం అధికారంలో లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. ఇక ఎప్పటికీ మన కులమే అధికారంలో ఉండాలి అని నిర్లజ్జగా మాట్లాడిన స్పీకర్ అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం చేయగలడా? అలాంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉన్న సభ పనితీరు ఎలా ఉంటుంది? ఇక ఇప్పుడు తాజాగా ఓ మంత్రిగారు కూడా కులం గురించి రెచ్చిపోయి మాట్లాడేశారు. తాను పుట్టిన కులంలో అందరూ దేవతలే, అందరూ విజయులే, తన కులంలో మాత్రమే గొప్పవాళ్ళున్నారు. ఇతర అన్ని కులాల కంటే నా కులం చాలా చాలా ప్రత్యేకం అనే రేంజ్లో చదువుసంధ్యలు లేని, ఆలోచన లేని ఆవేశపరులు రోడ్డు మీద పంచాయితీల దగ్గర మాట్లాడినట్టుగా మాట్లాడేశారు. ఇక ఆ మంత్రి పనితీరు ఎలా ఉంటుందో? స్వ, పర భేదాలు లేకుండా ప్రజలందరి కోసం నిస్వార్థంగా పనిచేస్తానని గవర్నర్ సాక్షిగా ఆయన చేసిన ప్రమాణానికి ఆయన ఆలోచనల్లో ఏ పాటి విలువ ఉంటుందో అన్న విషయాలు ఊహిస్తుంటేనే ఆయన ఎలాంటి మనిషో అర్థమవుతోంది. దురదృష్టవశాత్తూ ఆ స్పీకర్, ఈ మంత్రివర్యులిద్దరూ కూడా మన తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారే.
వీళ్ళు మన నాయకులు. సందర్భం వచ్చినప్పుడల్లా మళ్ళీ వీళ్ళే మీడియా ముందుకు వచ్చి కులరహిత సమాజం, నీతి, న్యాయం లాంటి గొప్ప విషయాల నుంచి పిల్లలను ఎలా పెంచాలి? ఎలా కష్టపడాలి? అవినీతికి దూరంగా ఎలా ఉండాలి? లాంటి విషయాలపైన ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతూ ఉండే ఈ నాయకుల గురించి ఏం మాట్లాడాలో, వీళ్ళ గురించి ఏమని అనుకోవాలో? వీళ్ళు ఏ స్థాయి మనుషులని భావించాలో కూడా అర్థం కావడం లేదు. నోట్ల రద్దుతో సహా మన పాలకులు ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా కూడా సపోర్ట్ చేయడానికి, కష్టాన్ని భరించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రజలకు ఆ మాత్రం దేశభక్తి ఎప్పుడూ ఉంది. ఉంటుంది. కానీ దేశ ప్రయోజనాల గురించి విశాల దృక్పథంతో ఆలోచించకుండా కులం, కుటుంబం కోసం ఆలోచిస్తూ అవినీతి కోటలను నిర్మించుకుంటున్న నాయకులను నమ్మాలంటేనే భయపడుతున్నారు. కంప్యూటర్ల కాలంలో ఉన్నాం అని గొప్పగా చెప్తూ కులాల కోసం కొట్టుకుచచ్చేలా ప్రజలను రెచ్చగొట్టే నాయకులను ప్రజలు మాత్రం ఎలా నమ్మగలరు?