భారతదేశ రాజ్యాంగం గురించి చదువుకునేటప్పుడు ఎవరికైనా కూడా ఛాతీ ఉప్పొంగుతుంది. కానీ అమలు తీరు చూస్తున్నప్పుడు మాత్రం ఉసూరనిపిస్తూ ఉంటుంది. కుల, మత, ప్రాంతాలకతీతంగా….అంటూ ఎంతో గొప్పగా ప్రమాణం చేసి పాలకులవుతున్న మన నాయకుల దిగజారుడు ఆలోచనల పుణ్యం అలా ఉంటుంది మరి. రాజ్యాంగంలో స్పీకర్ పదవి గురించి ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ మన కళ్ళతో చూస్తున్న స్పీకర్‌గారు మాత్రం ఆయనగారి కుల సభకు వెళ్ళి…..పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇకపై అలా జరగకూడదు, పది, పదిహేనేళ్ళు మనమే పవర్లో ఉండాలి…అని పవర్ఫుల్ డైలాగ్ చెప్పి కులజనులను రెచ్చగొడతాడు. అలాంటి వ్యక్తి స్పీకర్ ఛెయిర్లో కూర్చుని ఉంటే సభ ఎలా నడుస్తూ ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి వాళ్ళతో పాటు జెసీ దివాకర్‌రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ భజన చేస్తూ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జెసీకి, ఆయన కుటుంబానికి జరగిన లోటు ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జెసీ రెడ్డి కోల్పోతున్నది ఏమీ లేదు. వాడుకుని వదిలేసే రకమైన చంద్రబాబునాయుడు తన మేనల్లుడికి మాత్రం ఆడినమాట తప్పకుండా ఎమ్మెల్సీ సీటు ఇచ్చాడని ఈయనగారే చాలా గొప్పగా చెప్పారు. ఇక దివాకర్స్ బస్సు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినప్పటికి చంద్రబాబునాయుడితో పాటు, టిడిపి నాయకులు, టిడిపి భజన మీడియా అంతా కూడా జెసీపైన ఈగ వాలనియ్యకుండా కాపాడింది. ఇక ఈయనకు రెడ్డి ఫీలింగ్ ఎందుకు? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జెసీకి ఒకటేగా. అయినప్పటికీ చాలా తెలివిగా రెడ్డి కులస్థులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంటాడు. మరో వందేళ్ళ వరకూ రెడ్డి కులస్థుడు ముఖ్యమంత్రి అవడంట, రెడ్డిలు ముఖ్యమంత్రి అవకూడదనే రాష్ట్రాన్ని విడగొట్టారట. ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు సీనియర్ మోస్ట్ నాయకుడు, నిజాలు మాట్లాడే నాయకుడు అని మన మీడియా ఇలాంటి నాయకుడి గురించి ఎలా రాస్తుందా అన్న అనుమానం వస్తూ ఉంటుంది.
పేరు, పదవి ఉన్న నాయకులే ఈ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటే ఇక బి గ్రేడ్ నాయకులు, కార్యకర్తలు ఎలా రెచ్చిపోతారో వేరే చెప్పాలా? కమ్మ రక్తం పవర్ గురించి చెప్తూ ఒక బిగ్రేడ్ స్థాయి వ్యక్తి నిండు సభలో చేసిన వ్యాఖ్యల వీడియో యూట్యూబ్‌లో సూపర్ పాపులర్ అయింది. ఆ వ్యాఖ్యలు వింటూ ఉంటే ఏ కులస్థుడు అన్న విషయం తర్వాత……అసలు మనిషేనా వీడు అన్న అనమానం వస్తూ ఉంటుంది. జగన్, చంద్రబాబు, జెసీ, భజన మీడియా సంస్థలకు కులపిచ్చి మామూలుగా ఉండదు. జగన్ గెలిస్తే కమ్మ కులస్థులందరినీ ఏదో చేసేస్తాడు అనే స్థాయిలో పరోక్షంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు విషయంలో జగన్‌రెడ్డి స్ట్రాటజీ కూడా అలానే ఉంటుంది. అలా అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సొంత కులస్థులందరినీ ఉద్ధరించేస్తారని కూడా కాదు. అలా అయితే తెలుగు నాట రెడ్డి, కమ్మ కులస్థుల్లో ఏ ఒక్కరూ కూడా కష్టాల్లో ఉండకూడదు. ఎక్కువ కాలం పరిపాలించింది ఆ రెండు కులాల ముఖ్యమంత్రులే మరి. కానీ అలా జరిగిందా? రెండు కులాల జనాలు కూడా ఒకరినొకరు అనుమానాస్సదంగా చూసుకునేలా, శతృవుల్లా కొట్టుకునే స్థాయికి దిగజార్చే పనిని మాత్రం నాయ‘కుల’గజ్జిగాళ్ళు విజయవంతంగా చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ కొట్టుకుచచ్చిన జనాలకు చేసింది ఏమీ లేదు. కానీ సొంత జనాలు, సాటి అవినీతిపరులు, బినామీ జనాలకు మాత్రం దోచిపెట్టారు. జనాలకు మాత్రం కులగజ్జిని ఓ స్థాయిలో అంటించేశారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఏ కులం నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి అని చర్చించుకునే స్థాయిలో ప్రజలు ఉన్నారా? కనీసం తాగునీరు లేక గ్రామాలకు గ్రామాలే వలసపోతున్నాయి. చంద్రబాబేమో స్వర్గం చేస్తా, ఇంద్రలోకం చేస్తా అని గ్రాఫిక్స్ బొమ్మలతో ప్రజలందరినీ కూడా ఊహాలోకంలో విహరించేలా చేయాలని చూస్తున్నారు. ఎన్నో రకాలుగా అష్టకష్టాలు పడుతున్నప్పటికీ ప్రజలందరూ కూడా సమైక్యంగా వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా నాయకులేమో చాలా తెలివిగా కులాల లెక్కన జనాలను విభజించి కూర్చున్నారు. ఆ కులగజ్జిని ఏ స్థాయిలో అంటించి కూర్చున్నారంటే విదేశాలకు వెళ్ళి…అక్కడే స్థిరపడిన ఎన్ఆర్ఐలు కూడా కులగజ్జి మూలాలను మాత్రం వదిలించుకోలేకపోతున్నారు. బ్రిటీష్ వాడిది విభజించి పాలించు సిద్ధాంతం అని చెప్పుకుంటాం కానీ ఈ స్థాయిలో విభజించి పాలించడం బ్రిటీష్ వాళ్ళకు ఎక్కడ సాధ్యమైంది?