ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వమే చీటికి మాటికి ఓ సామాజిక వర్గం అంటూ పదే పదే విరుచుకు పడడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపెడుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చీటికి మాటికి కులాల ప్రస్తావన తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అసహనం తీసుకు వస్తోందంటున్నారు. ఎన్నికల సమయంలో, లేదూ మరో బలీయమైన కారణంగానో కులాల ప్రస్తావన తీసుకురావడం సమంజసంగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రతి అంశాన్ని కులానికి ముడిపెట్టడం భావ్యంగా లేదనే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయపడుతున్న సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా నిర్బంధ సెలవులు ప్రకటించారని, సామూహికంగా జరిగే ఎన్నికలను కేవలం ఆరు వారాలు వాయిదా వేస్తే వచ్చే ముప్పు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 90 శాతం స్థానాలు తామే గెలుచుకుంటామని ధీమాగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాయిదా పడిన ఆరు వారాల లోనూ ప్రజా తీర్పు మారిపోతుందని భయపడుతున్నారా..? అని నిలదీస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు, ఓ సామాజిక వర్గానికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ పట్ల అగ్రరాజ్యమైన అమెరికాతో సహా చిన్న దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక కార్యక్రమాలను రద్దు చేస్తున్నాయని, ఆదాయాన్ని తీసుకువచ్చే పర్యాటక రంగంపైనే నిషేధాజ్ఞలు విధించారని గుర్తు చేస్తున్నారు. ఇక 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఎన్నికలు జరగకపోతే వెనక్కి వెళ్లిపోతాయంటూ చేస్తున్న వాదనలో వాస్తవం లేదని, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఎన్నికలను సాకుగా చూపించి నిధులను విడుదల చేయకపోవడం జరగదని అంటున్నారు. అదే నిజమైతే తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కూడా నిలిచిపోతాయని, రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు తెచ్చుకుంటారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చీటికిమాటికి కులాల ప్రస్తావన తీసుకు వస్తూ గందరగోళం సృష్టించ వద్దంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.