తెలుగురాష్ట్రాల్లో తర్వాత కులాలవారి సమీకరణాలు సంభాషణలు, సంవాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతపురం పర్యటన వెల్కం గ్రూపు అవతరణ(లేదా పునరుద్ధరణ) ఇందుకో సందర్భంగా మారడం యాదృచ్చికమే. చాలాకాలంగా లోలోపల రగులుతున్న వ్యవహారాలు ఇప్పుడు రచ్చకెక్కాయని చెప్పాలి. గతంలోనే చెప్పుకున్నట్టు ఆంధ్రజ్యోతి అధినేత కొత్తపలుకులో ఇవన్నీ నేరుగా రాయడంతో సమస్య పరిష్కారమైందని భావించేవారు కొందరైతే ఆగ్రహిస్తున్న వారు మరికొందరు. ఇలాటి ఒక పెద్ద మనిషి ఆర్కేకు రాసిన లేఖ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మా కులమంతటినీ అప్పగించే హక్కు ఎక్కడిదని ఆ లేఖలో ప్రశ్న. మేము ఈ విషయం మాట్లాడుతుంటే మరో బిజెపి మిత్రుడు రెడ్ల సమావేశంలో ఒక నాయకుడు వీరావేశంతో ప్రసంగిస్తున్న విడియో చూపించారు. తెలంగాణలో ఈ వర్గానికి చెందిన నాయకులు ఇటీవల పాలక పార్టీలకు అతీతంగా ఒకింత భావోద్వేగం ప్రదర్శించడం పరిపాటిగా మారింది. టిటిడిపిలో రేవంత్రెడ్డి రభసను కూడా ఈ కోణంలోనే చూస్తున్నారు. ఇది గాక వైశ్యులపై ఐలయ్య రాసిన పుస్తకానికి అనుకూలంగా వ్యతిరేకంగా మరో వివాదం నడుస్తున్నది. గతంలోనే నేను విమర్శించిన పరిపూర్ణానంద స్వామి వంటి వారు కులాల పేర్లు తీసి మరీ ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. బిసిలు ఎంబిసిలను తమవైపు తిప్పుకోవడానికి ఎవరి తంటాలు వారు పడుతున్నారు. చంద్రన్న పెళ్లి కానుకపై చమత్కారాలు ఇందులో భాగమే. ముద్రగడ పద్మనాభం కాపుఆందోళన అంతులేని కథగానే నడుస్తున్నది. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన రెడ్డి ఇటీవల స్వాములచుట్టూ తిరుగుతుంటే ఆయన వెనక వున్న సామాజికవర్గాలలోనూ సందేహాలు పెరుగుతున్నాయంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏ కులాన్ని చేరువ చేసుకోవడానికి ఏంచేయాలన్నదానిపైనే పాచికలు వేస్తున్నారనేది బహిరంగంగా చెప్పుకుంటున్న విషయం. రాష్ట్ర విభజన రాజకీయ శక్తుల పుసస్సమీకరణ తర్వాత కులాల కుంపట్లు ఇంతలా రగులుకుంటాయని ఎవరూ అనుకోలేదు కాని అది కళ్లమందు కనిపిస్తున్నది.