రాజధాని అమరావతి డిజైన్ల తయారీ దాదాపు చివరి దశకు వచ్చేసిందని ఏపీ అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. డిజైన్లకు తుది మెరుగులద్దే కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యనే ఓ ప్రత్యేక బృందం లండన్ వెళ్లొచ్చిన సంగతీ తెలిసిందే. డిజైన్ల సంగతి ఎలా ఉన్నా… సింగపూర్ తరహాలో అభివృద్ధి ఉంటుందని మొదట్నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు. ఇంతకీ ఆ సింగపూర్ ఎలా ఉంటుందో, అక్కడ అభివృద్ధి ఏంటో అనే రాజధానికి భూములిచ్చిన రైతులకు పరిచయం చేయాలని ఏపీ సర్కారు సంకల్పించిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా తొలి విడతగా 34 మంది రైతులను సింగపూర్ పంపుతున్నారు. ఈ యాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. లాటరీ పద్ధతిలో 120 మందిని ఎంపిక చేశారు. మరో రెండు విడతల్లో ఎంపికైన ఇతర రైతులు కూడా సింగపూర్ వెళ్లొస్తారు.
ఈ యాత్రలో కూడా సామాజిక సమీకరణాల సమతౌల్యాన్ని చూడాలంటూ సూచనలు చేయడం కేవలం ఆ పార్టీ నేతలకే చెందుతుందని చెప్పాలి! రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూమిని ఎన్నో వేలమంది రైతుల ఇచ్చారు. అందరికీ సింగపూర్ చూడాలనే ఆశ ఉంటుంది. కానీ, వీసాలు ఉన్నవారిని టూరుకి అప్లై చేసుకోమన్నారు. వారిలో 120 మందిని లాటరీ పద్ధతి ద్వారా మంత్రి నారాయణ సమక్షంలోనే ఎంపిక చేశారు. అయితే, కొంతమంది టీడీపీ నేతలు ఇప్పుడు ఏమంటున్నారంటే… ప్రస్తుతం యాత్రకు వెళ్తున్నవారిలో సింగపూర్ అభివృద్ధిపై అవగాహన ఉన్నావారే ఎక్కుమంది ఉన్నారనీ, అలా కాకుండా అవగాహన ఏమాత్రం లేని వారిని పంపిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచిస్తున్నారు! అంతేకాదు, ఇక్కడ సామాజిక కోణాన్ని కూడా చూడాలట! వీలైనంతమంది మహిళలను పంపించాల్సిన అవసరం ఉందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు. బీసీలను, ఎస్సీ ఎస్టీ రైతులను ఎక్కువ సంఖ్యలో పంపాలని ఆయనే సూచించారు. బలహీన వర్గాలను కూడా తీసుకెళ్తే బాగుంటుందనీ, వారిలోనే భవిష్యత్తుపై ఆశలు పెరగాలన్నారు. ఇలాంటి టూర్లు వీలైనన్ని నిర్వహించాలనేది టీడీపీ నేతల సూచనలుగా వినిపిస్తున్నాయి.
నిజానికి, ఈ యాత్రను ఓ అవగాహనా కార్యక్రమం అనే కంటే, అధికార పార్టీ ప్రచారార్భాటం అనడం సరైంది. ఇలాంటి యాత్రల ద్వారా ప్రత్యేకంగా సాధించేది ఏముంటుంది..? ఓసారి సింగపూర్ చూపించినంత మాత్రాన ఆంధ్రా భవిష్యత్తుపై ఆశలు ఎలా పెరుగుతాయి…? అక్కడ భవనాలూ నిర్మాణాలను మాత్రమే అభివృద్ధికి కొలమానం అని చూపిస్తే సరిపోతుందా..? దీని అంతిమ ప్రయోజనం కేవలం ప్రచారమే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇది చాలదన్నట్టుగా.. దీన్లో కూడా సామాజిక సమీకరణాలూ, కులాలు, వర్గాలు.. ఇలాంటి లెక్కల్ని కూడా సమతౌల్యం చేస్తూ వీలైనన్ని ఎక్కువ యాత్రలు పెట్టాలంటూ కొంతమంది నేతలు చేస్తున్న సూచనలు మరీ వింతగా వినిపిస్తున్నాయి.