చింతామణి నాటకం వందేళ్ల నుంచి ఉంది. దానికి శతాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించాలనుకుంటున్నారు. సినిమా, టీవీలు లేనప్పుడు.. నాటకాలదే హవా. ఆ కాలంలో నాటకాల్లో చింతామణి నాటకం… సినిమాల్లో షోలే.. బాహుబలి లాంటి వాటికి వంద రెట్లు పెద్దది. అంత ప్రఖ్యాతి గాంచిన ఆ నాటకంపై కూడా కులం ముద్ర వేసేస్తున్నారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి అనే పాత్ర ఆర్యవైశ్యులను ఉద్దేశించి ఉందని.. తక్షణం ఆ నాటకాన్ని బ్యాన్ చేయాలని ఆర్యవైశ్య సంఘాలు తెర మీదకు వచ్చాయి. వందేళ్లుగా నాటకం ప్రదర్శితమవుతున్నా.. ఇప్పటి వరకూ సుబ్బిశెట్టి పాత్ర ఆర్యవైశ్య కులానికి ప్రతినిధిగా ఉందని గుర్తించలేదో.. లేక ఇప్పుడే తెలిసిందో కానీ… కుల సంఘాలు చింతామణి నాటకం టార్గెట్గా రంగంలోకి దిగిపోయారు.
ఆలిండియా ఆర్యవైశ్య మహాసభ చెన్నైలో ప్రెస్మీట్ పెట్టి.. ఎక్కడైనా చింతామణి నాటకం ప్రదర్శిస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తోటి కులస్తులకు పిలుపునిచ్చింది. సినీ నిర్మాత అంబికా కృష్ణ కూడా… అదే తరహా డిమాండ్ వినిపించారు. తమ మనోభావాలను చింతామణి నాటకం దెబ్బతీసిందని.. ఎవరైనా ప్రదర్శించినా.. రాజకీయంగా ఎవరైనా ప్రోత్సహించినా… వారికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. చింతామణి నాటకంపై కొత్తగా రేగుతున్న వివాదం చూసి… ఇతరులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.
చింతామణి నాటకం.. సమాజాన్ని చైతన్యం వంతం చేయడానికి ఉద్దేశించింది. అందులో పాత్రలు..పాత్రధారులు.. ఆనాటి సమాజంలో ఉన్న వారిని ప్రతిబింబిచేలా రచయిత రాసుకుని ఉంటారు. అంత మాత్రాన.. అవి కులాన్ని మొత్తం ప్రతిబింబించాలని ఏమీ లేదు. అలా అనుకోవడం కూడా మూర్ఖత్వం. కానీ.. ప్రస్తుతం.. ఆంధ్రసమాజంలో అంతా కులాల మయం. ఎవడేంమాట్లాడినా.. సినిమాల్లో ఏ డైలాగ్ వచ్చినా.. ఏ పాత్ర ఏ ఆహర్యం లో కనిపించినా.. కులాన్ని అంటగట్టుకోవడం కామన్ అయిపోయింది. అంటే కులం క్యాన్సర్ అంతగా ముదిరిపోయిందన్నమాట. ఇలాంటి వాతావరణంలో… చింతామణి నాటకంపై కులం ముద్ర వేయడం పెద్ద ఆశ్చర్యకరం కాదు.