https://youtu.be/nNqbNtoyk1M
శ్రీ రెడ్డి ఏ క్షణాన కాస్టింగ్ కౌచ్ అనే తేనె తుట్టెను కదిపిందో కానీ, అప్పట్నుంచి టాలీవుడ్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇవాళ పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి సమస్యపై స్పందిస్తూ – ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందు పోలీసులు, కోర్టును ఆశ్రయించాలని సూచించగా- ఆ తర్వాత ఆ సూచన ఎంతవరకు సబబు అనే దానిపై టీవీ 9 లో చర్చ కొనసాగింది. అయితే ఈ చర్చ లో భాగంగా లైవ్లో అనూహ్యంగా టీవీ9 కత్తి మహేష్ కి గట్టి షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..
కాస్టింగ్ కౌచ్ విషయంలో దళారుల పాత్ర గురించి చర్చలు చర్చ లో సునీత అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ పాల్గొంది. పవన్ కళ్యాణ్ సూచనని తప్పు పడుతూ ఆమె మాట్లాడింది. తనలాంటి చిన్నవాళ్లు పోలీస్ స్టేషన్కు వెళ్లినా కేసులు తీసుకోరని తనకు అలాంటి అనుభవం జరిగిందని చెప్పుకొచ్చింది. ఎవరి విషయం లో అలా జరిగిందని ప్రశ్నిస్తూ ఈ చర్చ కొనసాగుతూ ఉండగా, కత్తి మహేష్ తనపై బలవంతం చేశాడని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించింది.
ఒక సంవత్సరం క్రిందట, బిగ్ బాస్ షో లో పాల్గొనటానికి ముందే కత్తి మహేష్ తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమని చెప్పింది. కత్తి మహేష్ ని బిగ్ బాస్ లో చూసి షాకయ్యానని, బిగ్ బాస్ నుంచి ఆయన ఎలిమినేట్ అయ్యాక ఆయనను కలిశానని, మరికొన్ని రోజులు బిగ్ బాస్ షోలో ఉంటే బాగుండేదని చెప్పానని, అలాగే కత్తి మహేష్ తనకు సినిమాలో అవకాశం ఇస్తానని అని అన్నాడని చెప్పింది. ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా కలవమని కత్తి మహేష్ అన్నాడని, ఎక్కడికి రావాలో అడ్రస్ కూడా ఫేస్ బుక్ మెసేజ్ చేశాడని, కావాలంటే ఆ మెసేజ్ కూడా చూపిస్తానని చెప్పింది. తీరా అక్కడికి వెళ్లాక కత్తి మహేష్ తలుపు గడియ పెట్టి తనపై బలవంతం చేశాడని, తాను తిరిగి వెళ్లడానికి చార్జీలకు 500 రూపాయిలు ఇచ్చి వెళ్లిపొమ్మన్నాడు అని చెప్పింది. ఇదే కత్తి మహేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్- జనసేన లతో గొడవ సందర్భంగా అన్ని మీడియా చానెళ్లకు వెళ్లి సూక్తులు చెబుతుంటే చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. అలాగే కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ గొడవ సమయంలోని తాను టీవీ9 కి కూడా వచ్చానని, ఇప్పుడు చేస్తున్న ఈ ఆరోపణ ఆరోజే మీకు (టివి9 కి) చెప్పానని, కానీ మీరు (అంటే టీవీ9 ) కూడా ఆరోజు ఈ విషయాన్ని టెలికాస్ట్ చేయలేదని చెప్పింది. దీంతో టీవీ ని యాంకర్ ఖంగు తినాల్సి వచ్చింది. అక్కడితో ఆగకుండా నేను ఏ రోజున టీవీ9 కి వచ్చి ఆ విషయం చెప్పానో ఆ తేదీ కూడా చెబుతానని, కావాలంటే మీరు మీ రికార్డులలో చెక్ చేసుకోవచ్చని చెప్పింది. అంతేకాకుండా ఈ విషయం మీద ఫిర్యాదు చేయడానికి ఆ రోజే పోలీస్ స్టేషన్ కి వెళ్లానని, కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని, అన్ని మీడియా చానళ్లు ఆరోజు (పవన్-కత్తి గొడవ జరుగుతున్నపుడు) కత్తి మహేష్ కు సపోర్ట్ ఉన్నందువల్లే ఆరోజు పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పారని ఆరోపించింది.
అయితే కత్తి మహేష్ ఈ ఆరోపణలను ఖండించాడు. సునీత అనే ఈ అమ్మాయి తనకు ఏడాది నుంచి పరిచయమున్న మాట వాస్తవమేనని, ఆమె తనను వ్యక్తిగతంగా కలిసిన మాట కూడా వాస్తవమేనని, ఆమెకి తాను డబ్బు ఇచ్చిన మాట కూడా వాస్తవమేనని అంగీకరించాడు కత్తి మహేష్. అయితే ఆమె కష్టాల్లో ఉందని చెప్పడం వల్లే ఎంతో కొంత డబ్బు సాయం చేశాను తప్ప ఆమె మీద ఎటువంటి అఘాయిత్యం చేయలేదని కత్తి మహేశ్ వ్యాఖ్యానించాడు. ఆరోపణలు చేస్తున్న ఈమె ఆధారాలుంటే చూపించాలని, ఆమెతో పాటు పోలీసు స్టేషన్కి రావడానికి తాను సిద్ధమేనని అన్నాడు
మొత్తానికి కాస్టింగ్ కౌచ్ గురించి చర్చల్లో పాల్గొంటూ శ్రీ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్ కి తనమీదే ఈ ఆరోపణలు రావడం గట్టి షాక్ అనే చెప్పాలి . అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి వాడివేడి చర్చలు నిర్వహిస్తున్న టీవీ9 కి కూడా ఇది గట్టి షాక్ – ఎందుకంటే సునీత అనే ఈ మహిళ గతంలోనే కత్తి మహేష్ గురించి టీవీ9 కి ఫిర్యాదు చేస్తే అప్పటి పరిస్థితులను బట్టి టీవీ9 ఆ వ్యాఖ్యలని ప్రసారం చేయలేదని, ఆ మహిళ వ్యాఖ్యల బట్టి అర్థమవుతోంది. ఇందులో ఎవరివి ఆరోపణలు ఏవి నిజాలు అనేది తెలియడానికి సమయం పట్టొచ్చు లేదా ఎప్పటికీ తెలియకుండానే పోవచ్చు. కానీ ఉరిమి ఉరిమి ఎవరైతే నీతులు చెబుతున్నారో వారిమీదే మంగళం పడటం మాత్రం ఆశ్చర్యకరం.
కొసమెరుపు: కత్తి పై ఆరోపణలు చేసిన ఈ అమ్మాయి తో మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత అని చెప్పిన టివి9 బ్రేక్ అయ్యే సరికి ఆమెని డిబేట్ లోనుంచి తప్పించడం ఒక కొసమెరుపు అయితే, ఇలాంటి సమస్యలు వచ్చినపుడు టీవీల్లో చర్చించడం కాదు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని ఖండించడానికి పెట్టిన ఈ ప్రోగ్రాం లో సునీత అనే ఈమె కత్తి మహేష్ మీద, టివి9 మీద వ్యాఖ్యలు చేయగానే ఆమె వ్యాఖ్యలపై చర్చించకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని టివి9 యాంకర్, కత్తి మహేష్ సూచించడం ఇంకో కొసమెరుపు.