మొత్తానికి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ఈ విషయంలో ఉపేక్షించి లాభం లేదని, సత్వరమే దానిపై చర్యలు తీసుకోవాలని టీ సర్కార్ భావించడం, అందుకు తగిన మార్గ దర్శక సూత్రాలతో సిద్ధం కావడం ఆహ్వానించదగిన అంశమే. కాకపోతే కాస్టింగ్ కౌచ్ వ్యవహారానికి చమరగీతం పాడడం ప్రభుత్వం చేతుల్లో లేని పని. మార్పు రావాల్సింది చిత్రసీమలోనే. `కమిట్మెంట్` అనే మాట ఎప్పటి నుంచో ఉంది. దానికి అగ్ర కథానాయికలు కూడా అతీతం కాదు. అది.. అలిఖిత ఎగ్రిమెంట్ లాంటిదన్న సంగతి అందరికీ తెలుసు. దర్శకుడు, కథానాయకుడు, నిర్మాత.. ఆఖరికి ఛాయాగ్రహకుడు కూడా `కమిట్మెంట్` అంటూ కథానాయికల్ని వేధించిన, వేధిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కాకపోతే… అవేం శ్రీరెడ్డి వ్యవహారంలా బయట పడలేదు. ”కమిట్మెంట్లు పెద్ద పెద్ద హీరోలకేనా, మాలాంటి స్టార్ కమిడియన్లకు ఉండవా” అంటూ ఓ అగ్ర హాస్యనటుడు తన తోటి నటీనటుల దగ్గర, దర్శకుల దగ్గర బాహాటంగా చెప్పిన సందర్భాలు ఒకట్రెండున్నాయి. కమిట్ మెంట్ అనేది ఆ స్థాయికి దిగజారింది.
ప్రభుత్వాలు చట్టాలు చేస్తేనో, లేదంటే.. ఫిల్మ్ ఛాంబర్ దానిపై నిఘా వేస్తేనో.. ఈ సమస్య పరిష్కారం అవ్వదు. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం ఎలా నడిచిపోయిందో, ఇక మీదటా అలానే నడిచిపోతుంది.. అదీ రహస్యంగానే. ఇప్పుడు ‘కమిట్మెంట్’ విషయంలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు మరింత జాగ్రత్త పడిపోతారు. అంతే తేడా. నిజానికి ఇలాంటి వ్యవహారాల్ని సాక్ష్యాలతో నిరూపించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడైతే దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఫోన్లు, వాట్సప్ చాట్ల విషయంలో సినిమా ప్రముఖులంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాటికి ఇక ఎవ్వరూ దొరక్కపోవొచ్చు. ఒకవేళ వీడియో సాక్ష్యం బయటకు తీసుకురావాలంటే.. ఆ వీడియోలో సదరు కథానాయికలు కూడా కనిపిస్తారు. అంటే… తమ నగ్నత్వాన్ని ఫ్రీగా ప్రదర్శించడానికి తప్ప ఆ వీడియో సాక్ష్యాలు ఎందుకూ ఉపయోగపడవు.
అన్నింటికంటే ముఖ్యవిషయం… కథానాయికలెవ్వరూ ఈ కాస్ట్ కౌచింగ్‌పై నోరు మెదపలేదు. ‘అసలు మాకు ఇలాంటివి ఎదురు కాలేదు సుమీ’ అంటూ అమాయకత్వం ప్రదర్శిస్తున్నారు. అంటే పరోక్షంగా వాళ్లు కూడా కాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తున్నవాళ్లే. ఒకవేళ ధైర్యం చేసి నోరు మెదిపితే.. తమకొచ్చే అవకాశాలకు గండి పడుతందని వాళ్లకు తెలుసు. శ్రీరెడ్డి ఎందుకు జనంలోకి వచ్చిందంటే.. తనకు దీని వల్ల కొత్తగా వచ్చే నష్టాలేం ఉండవు. కానీ సినిమా రంగంలో దూసుకుపోతున్న వాళ్లు అలా కాదు కదా. ఇక మీదటే వాళ్లు జాగ్రత్త పడాలి. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తే.. కచ్చితంగా కొత్తమ్మాయిలకు కొంత వరకూ న్యాయం జరగొచ్చు. పరువు, మర్యాదలకు ప్రాణం పెట్టేసినిమా వాళ్లు.. ‘ఎందుకొచ్చిన గొడవ’ అంటూ వెనకడుగు వేయొచ్చు. కాకపోతే ఇప్పటికే ఆ రుచి మరిగిన వాళ్లలో మార్పు ఆశించడం కష్టం. స్వతహాగా వాళ్లు మారినప్పుడే ఇలాంటి దురాగతాలకు తెర పడుతుంది. మనసులు, మనస్తత్వాలు, అలిఖిత నిబంధనలూ మారనంత వరకూ.. ఏ సమస్యా పరిష్కృతం కాదు.