తెలంగాణాలో సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ శనివారం షో కాజ్ నోటీస్ జారీ చేసింది. టీ-కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె. జానారెడ్డిని తెరాస కోవర్టు అని విమర్శించారు. ఆయన వలనే పార్టీ నుంచి ఒకరొకరు తెరాసలోకి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. పాల్వాయి ఆరోపణలతో తీవ్ర మనస్తాపం చెందిన జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదు చేయడంతో పాల్వాయికి షో కాజ్ నోటీసు జారీ చేయడానికి టీ-కాంగ్రెస్ కి అనుమతి లభించింది. జూన్ 17లోగా పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి జానారెడ్డిపై చేసిన ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చుకోవలసిందిగా పాల్వాయిని కోరింది. దానికి పాల్వాయి బదులిస్తారో లేక జానారెడ్డిపై ఇంకా తీవ్ర విమర్శలు గుప్పిస్తారో చూడాలి.
తెరాస ఇవ్వజూపుతున్న పదవులకి ఆశపడి ఇప్పటికే చాలా మంది టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వెళ్ళిపోయారు.ఇంకా వెళ్లిపోతూనే ఉన్నారు. నిజానికి టీ-కాంగ్రెస్ లో అందరూ కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలే ఉన్నారు. వారందరూ కలిసికట్టుగా పనిచేసి ఉంటే తెరాసను ఎదుర్కోవడం వారికేమి పెద్ద కష్టం కాదు. అందరూ కలిసికట్టుగా వ్యవహరించి పార్టీని తెరాస బారి నుంచి కాంగ్రెస్ పార్టీని, దానితో ముడిపడున్న తమ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోగా ఒకరితో మరొకరు కీచులాడుకొంటూ పార్టీని అంతర్గతంగా బలహీనపరుస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జానా రెడ్డి ఇద్దరూ పార్టీలో చాలా సీనియర్ నేతలే. వారు పార్టీకి మార్గదర్శనం చేసి నడిపిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ జరుగుతున్నది మరొకటి. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా తనవంతుగా పార్టీపై ఓ రాయి విసిరారు. టీ-కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆ పదవికి అనర్హుడని బహిరంగంగా విమర్శించారు. బహుశః అందుకు కోమటిరెడ్డికి కూడా త్వరలో షో కాజ్ నోటీసు జారీ అవుతుందేమో. తెరాస కారణంగా ఒకవైపు పార్టీ బలహీనపడుతుంటే, ఈ కీచులాటల కారణంగా కూడా మరికొందరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఈవిధంగా ఒకేసారి రెండు వైపుల నుండి పార్టీకి ఎదురు దెబ్బలు తింటోంది.