ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌పై కేసు, సస్పెన్షన్ వ్యవహారంపై.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ క్యాట్.. ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్ పిచ్చిగా ప్రవర్తించిందని మండిపడింది. కృష్ణ కిషోర్ విషయంలో ఏపీ ప్రభుత్వం హద్దులు దాటిందని సస్పెన్షన్‌లో నిబంధనలు పాటించలేదని తేల్చింది. కృష్ణ కిషోర్ సస్పెన్షన్ అసమంజసమని… రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలని అధికారులపై కక్ష సాధింపులకు కాదని మండిపడింది. కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
డిప్యూటేషన్ నుంచి..తనను రిలీవ్ చేయాలని అడిగినా.. చేయకపోవడంపై… మండిపడింది. ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్‌ను ఎందుకు రిలీవ్ చేయలేదని ప్రశ్నించింది. కేంద్ర ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వివరణ ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. చంద్రబాబు హయాంలో ఏపీ ఎకనమిక్ డెలవప్మెంట్ బోర్డు చైర్మన్ గా పని చేసిన..కృష్ణకిషోర్‌ను జగన్ సర్కార్.. ఆరు నెలల నుంచి వెయిటింగ్లో పెట్టింది. పది రోజుల కిందట సస్పెండ్ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కృష్ణ కిషోర్‌పై సీఐడీతో కేసు నమోదు చేయించారు. దీంతో క్యాట్‌ను ఆశ్రయించారు కృష్ణ కిషోర్.
వారం రోజుల కిందటే.. ఈ సస్పెన్షన్ పై స్టే విధించిన క్యాట్.. ఈ రోజు.. అసలు సస్పెన్షన్ విధించడం… రిలీవ్ చేయకపోవడంపై… వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వ్యక్తిగత కక్షలకు… ఇతర అధికారుల్ని ఉపయోగిచుంకుని.. డిప్యూటేషన్ పై వచ్చిన వారిపై సాధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఏపీ సర్కార్ పై తీవ్రంగా వస్తున్నాయి. ఇప్పుడు.. క్యాట్ కూడా వివరణ అడిగింది. కృష్ణకిషోర్ పై.. కక్షపూరితంగా వ్యవహరించిన అధికారులే ఈ ఉదంతంలో ఇరుక్కుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.