ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని పెద్దలు చెబుతుంటారు. మన కథానాయికల్లో స్టార్ డమ్ తెచ్చుకొన్నవాళ్లంతా.. మీడియా ముందు వినయంగానే ఉంటారు. అయితే మరో రకం.. కథానాయికలున్నారు. చేతిలో ఒక్క హిట్టూ లేకపోయినా.. వాళ్లిచ్చే బిల్డప్పులకు అంతూ పొంతూ ఉండదు. కేథరిన్ ఆ టైపే! తలతిక్క సమాధానాలు చెబుతూ…తన రూటే సపరేటు అన్నట్టు ప్రవర్తిస్తుంటుంది. మీడియా అంటే.. కేథరిన్‌కి చిన్నపూపు. ఎర్రబస్సు సమయంలో మీడియా ముందు నోరుజారింది కేథరిన్. అప్పట్లో కేథరిన్ ఇంటర్వ్యూలను మీడియా సస్పెండ్ చేసింది. ఇప్పుడు సరైనోడు ప్రమోషన్లలోనూ తన టెక్కు చూపించే ప్రయత్నం చేసింది.
ఆదివారం దిన పత్రికలకు, వెబ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది కేథరిన్. పాత్రికేయులు అడిగిన ఒక్క ప్రశ్నకూ తిన్నగా సమాధానం చెప్పలేదట కేథరిన్. ”బన్నీతో మీ కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుంది.. అందుకే వరుసగా మూడో సినిమా చేస్తున్నారు.” అని అడిగితే ఇంతెత్తున లేచిందట. ”కెమిస్ట్రీ కుదరడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? అసలు కెమిస్ట్రీ అంటే ఏమిటి?” అంటూ క్లాస్ తీసుకొనే ప్రయత్నం చేసిందట. ‘గ్లామర్ పాత్రలే చేస్తారా’ అని అడిగిన మరో ప్రశ్నకూ ఇలానే వైల్డ్‌గా రియాక్షన్ ఇచ్చిందట. ”గ్లామర్ పాత్రలు నేనెక్కడ చేశాను? తెలిసీ తెలియక మాట్లాడకండి” అంటూ ఓ రేంజులో రెచ్చిపోయిందట. ఏది అడిగినా రివర్స్‌లో సమాధానం చెప్పేసరికి పాత్రికేయులంతా విస్తుపోయారట. మరీ ఇంత గోరోజనం ఉంటే ఎలా తల్లీ..? అసలే సినిమాల్లేవు.. ఇప్పుడు పబ్లిసిటీ కూడా దొరకదు.