ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి వున్నట్టు… ప్రతి కథ మీద దర్శక రచయితలు వర్క్ చేసేటప్పుడు ఆ కథలో నటించబోయే హీరో పేరు దేవుడు ముందే రాసి పెడతాడేమో! అలాగే, ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ కథ మీద దేవుడు మాస్ మహారాజ్ రవితేజ పేరు రాసినట్టున్నాడు. పవన్ కళ్యాణ్ నుంచి నాని దగ్గరకు వెళ్లిన కథ చివరకు రవితేజ వద్దకు వచ్చి ఆగిందని సమాచారమ్. పవన్ కోసం సంతోష్ ఓ కథ రెడీ చేశాడు. కానీ, పవన్ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో మరో హీరోతో సినిమా చేయడానికి ఆయన దగ్గర అనుమతి తీసుకున్నాడు దర్శకుడు. మొదట ఈ కథను నానితో చేస్తే ఎలా వుంటుంది? అనే ఆలోచన వచ్చింది. కానీ, రవితేజ అయితే బాగుంటుందని అడగటం, ఆయన అంగీకరించడం జరిగాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మాస్ మహారాజ్ రవితేజ ఓ సినిమా కమిట్ అయ్యాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చేయనున్నాడు. అది పూర్తయిన తర్వాత సంతోష్ శ్రీనివాస్ సినిమా ప్రారంభిస్తారు. ఇందులో కథానాయికగా కేథరిన్ త్రెసా పేరు పరిశీలనలో వుంది. ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసినట్టే.