వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్కు బదిలీ అయింది. ఎప్పుడు విచారణ ప్రారంభమవుతుందో కానీ.. సీబీఐ అధికారులు మాత్రం మరోసారి పులివెందులకు వచ్చారు. ఎవర్నీ ప్రశ్నించడానికి రాలేదు కానీ.. వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన ఇంటి పరిసరాలను.. వైసీపీ ఆఫీసు పరిశరాల్ని పరిశీలించారు. ఎంపీ అవినాష్ రెడ్డి గురించి కూడా ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. గతంలో ఓ సారి ఇలాగే.. స్థానిక ఎమ్మెల్యే అయిన సీఎం జగన్ క్యాంప్ ఆఫీసును కూడా పరిశీలించారు. ఈ క్యాంప్ ఆఫీసును అవినాష్ రెడ్డి కుటుంబమే చూసుకుంటూ ఉంటుంది.
వివేకా హత్య కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందని .. ప్రధాన నిందితులెవరో కనిపెట్టారని.. కానీ వారిని అరెస్ట్ చేయాడనికి సీబీఐ వెనుకడుగు వేస్తుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఈ కారణంగానే దర్యాప్తు ఆగిపోయిందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం కీలక మలుపులకు కారణం అయింది. ఇప్పుడు సీబీఐ మరోసారి నిందితుల అరెస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల బెయిల్ పై ఉన్న నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనిపై తీర్పు రానుంది. ఆ తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.