కల్వకుంట్ల కవితకు కష్టకాలం నడుస్తోంది. తీహార్ జైల్లో ఉన్న ఆమెను సీబీఐ కూడా అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది. ఇప్పటికే జైల్లో ఉన్న ఆమెను అరెస్టు చేసినట్లుగా ప్రకటించడం వల్ల ప్రత్యేకంగా నష్టం ఏమీ లేదు కానీ.. బయటకు రావాలంటే మాత్రం ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసులోనూ ఇప్పుడు బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయింది. పూర్తి స్థాయి బెయిల్ పై విచారణ జరగాల్సి ఉంది.
సీబీఐ కేసులో విచారణకు కవిత హాజరు కావడంలేదు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా ఏదో ఓ కారణంగా తప్పించుకుంటూ వస్తున్నారు. ఫిబ్రవరిలోనూ నోటీసులు ఇచ్చినా ఆమె తాను రాలేనని.. తనకు రాజకీయంగా చాలా పనులు ఉన్నాయని.. కావాలంటే వర్చువల్ గా హాజరవుతానని సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంపై సీబీఐ నుంచి రిప్లయ్ రాలేదు. ఈడీ అరెస్టు చేసిన తర్వాత తాము కూడా ప్రశ్నిస్తామని కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. అనుమతి ఇవ్వొద్దని కవిత తరపు లాయర్లు గట్టిగా వాదించినా ప్రయోజనం లేకపోయింది.
ఇప్పుడు కవితను అరెస్టు చూపించడంతో గట్టి షాక్ తగిలినట్లయింది. అటు ఈడీ, ఇటు సీబీఐ కేసుల్ని కవిత సమాంతరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేసుల్లో బెయిల్ పిటిషన్లు అంత త్వరగా పరిష్కారమయ్యే అవకాశం లేదని.. అంచనా వేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత అత్యంత కీలకం అని దర్యాప్తు సంస్థలు గట్టిగా చెబుతూండటమే కారణం.