వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయమే భాస్కర్ రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో వెళ్లిన సీబీఐ అధికారులు .. అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చి వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. మరో వైపు అవినాష్ రెడ్డి పులివెందులలో లేరు. ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని అవినాష్ రెడ్డి నివాసానికి కూడా సీబీఐ అధికారులు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
పట్టుబట్టి మరీ .. సుప్రీంకోర్టు దాకా వెళ్లి దర్యాప్తు అధికారిని మార్పించేసుకున్న ఆనందం అవినాష్ రెడ్డి బృందానికి పెద్దగా మిగలడం లేదు. కొద్ది రోజులుగా సీబీఐ సైలెంట్ గా ఉండటంతో తమ ప్లాన్ వర్కవుట్ అయిందనుకుని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకుని దిలాసాగా ఉన్న అవినాష్ రెడ్డికి సీబీఐ వరుస షాకులు ఇస్తోంది. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి… రిమాండ్ రిపోర్టులో అసలు ఏం జరిగిందో చెప్పిన సీబీఐ… తర్వాతి రోజే తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది.
వివేకా హత్య కేసులో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని … మరిన్ని అరెస్టులు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అలా రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించిన ఒక్క రోజులోనే ఇలా ఉదయమే అరెస్టులు చేయడం సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో చాలా స్పష్టంగా టెక్నికల్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ నిందితులు రకరకాల పిటిషన్లు వేసి.. అనేక రకాల ఆరోపణలు చేస్తూ.. చివరికి దర్యాప్తు సంస్థపైనా పిటిషన్లు వేసి ఒత్తిడి తెచ్చి దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేశారు . ఇప్పుడు అాలాంటి ప్రయత్నాలకు క్లైమాక్స్ పడినట్లయింది. ఒకటి, రెండు రోజుల్లో వివేకా హత్య కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.