డిల్లీలో కొలువైన నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాల మద్య గత ఏడాదిన్నరగా సాగుతున్న పోరు నేడు మరో మలుపు తిరిగింది. అరవింద్ కేజ్రీవాల్ కి ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్న రాజేంద్ర కుమార్ తో సహా మరో నలుగురు అధికారులని సోమవారం సిబిఐ అరెస్ట్ చేసింది. వారందరూ అవినీతికి పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసింది. ఊహించినట్లుగానే అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఆయన మంత్రులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి విమర్శలని, ఆగ్రహాన్ని మోడీ ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకొన్న దాఖలాలు లేవు. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి నిత్యం ఏదో ఒక అగ్ని పరీక్షలు పెడుతూనే ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ప్రజల దృష్టిని ఆకర్షించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ పైనే అవినీతి నిరోదక శాఖ ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న విమర్శలను మోడీ ప్రభుత్వం ఏవిదంగా పట్టించుకోవడం లేదో, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా తనపై మోపబడిన ఆ కేసు గురించి పట్టించుకోవడం లేదు.
అరవింద్ కేజ్రీవాల్ నే వదిలిపెట్టని కేంద్రం ఆయన ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలిపెడుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. వారిలో చాలా మందిపై తరచూ ఏదో ఒక కేసు నమోదు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిని సిబిఐ అరెస్ట్ చేసి పట్టుకుపోయింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అరవింద్ కేజ్రీవాల్ తన క్రింద పనిచేస్తున్న అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటే ఉపేక్షిస్తారనుకోలేము. కనుక ఈ చర్యలన్నీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని క్రమంగా బలహీనపరచడానికేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ కక్ష సాధింపు చర్యల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి ప్రశాంతత కరువైంది. ఎప్పుడూ ఈ సమస్యలని ఎదుర్కోవడానికే సమయం సరిపోతోంది.
అరవింద్ కేజ్రీవాల్ బలం నీతి నిజాయితీ..అవినీతిని వ్యతిరేకించడం. కనుక ఆయన ప్రభుత్వంపై నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూ, అరెస్టులు చేయడం ద్వారా ఆ బలాన్నే దెబ్బ తీసి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని కేంద్రం ప్రయత్నిస్తునట్లుంది. ఇటువంటి చర్యలే మోడీ విశ్వసనీయతని దెబ్బతీస్తాయి.