కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. రాజకీయ బాసుల కోసం.. వారి ప్రత్యర్థుల్ని కేసులతో వేటాడుతోందనే ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే.. ఇప్పుడు సీబీఐలోని టాప్ టూ ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన వివాదంతో.. వాటికి సంబంధించిన సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ను సీబీఐ కేసుల్లో ఇరికించేందుకు .. దొంగ పత్రాలు సృష్టించిన వైనం.. ఇప్పుడు బయటపడింది. సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ అరెస్ట్‌తో… తీగలాగడం ప్రారంభమయింది. ఓ కేసులో సతీష్‌బాబు సానా అనే వ్యక్తి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రమేష్ పేరు ప్రస్తావించినట్లు ఒక స్టేట్మెంట్ను సృష్టించారు. ఆ స్టేట్మెంట్ను సృష్టించిన విచారణ అధికారి అయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం సతీష్‌బాబు సానా ఒక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దేవేందర్‌కుమార్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించారు. అయితే ఆ రోజు సతీష్ ఢిల్లీలో లేరని విచారణలో వెల్లడైంది. దాంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి దేవేందర్‌ను అరెస్ట్ చేశారు. వాస్తవానికి విచారణలో సతీష్ సానా ఇచ్చిన వాంగ్మూలానికి దేవేందర్‌కుమార్ నమోదు చేసిన వాంగ్మూలానికి సంబంధం లేదని అధికారులు తేల్చారు. సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు గుర్తించారు. సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని, సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్మెంట్ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సతీశ్ సనా పేరు బయటకు వచ్చింది.
ఖురేషిని వేధించకుడా ఉండేందుకు సీబీఐ ఉన్నతాధికారులు రూ.5 కోట్లు డిమాండ్ చేసి, మూడు కోట్లు ముడుపులు పుచ్చుకున్నారన్నది ఆరోపణ. ఈ కేసులో ఆరోపణలన్నీ… సీబీఐలో టాప్ టూ పొజిషన్లలో ఉన్న అలోక్ వర్మ, రాకేష్ అస్థానాల చుట్టూ ఉన్నాయి. వీరిద్దిరి మధ్య వాటాల్లోనో.. ఆధిపత్య పోరాటంలోనే వచ్చిన తేడాలతోనే ఈ విషయం బయటపడింది. ఈ కేసులో సీఎం రమేష్‌ను కూడా ఇరికించేందుకు ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారి దొంగ పత్రాలు సృష్టించడం కలకలం రేపుతోంది. సీఎం రమేష్ ఇళ్లపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏమీ దొరికినట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియాకు, బీజేపీ నేత జీవీఎల్ మాత్రం.. రూ. వంద కోట్ల అక్రమాలంటూ.. పేపర్లు అందాయి. అవి నిజమైనవో కావో క్లారిటీ లేకుండా వాళ్లు రాజకీయానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ కేసులోనే ఇరికించే ప్రయత్నం చేసినట్లు బయటకు తెలియడం కలకలం రేపుతోంది.