హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా గతంలో పనిచేసిన ఏపీ మాజీ మంత్రి, ప్రస్తుత తెరాస నేత విజయరామారావు కుమారుడు ఒక సీబీఐ కేసులో బుక్ అవటం సంచలనం సృష్టిస్తోంది. శ్రీనివాస కళ్యాణ్‌రావు అనే ఈయన మూడు బ్యాంకులనుంచి నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులనుంచి వందలకోట్ల రుణాలు తీసుకోవటమేకాక వాటిని ఎగ్గొట్టటంతో ఆ బ్యాంకుల అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేశారు. సీబీఐ వారు 420, 120బీ తదితర సెక్షన్లకింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస కళ్యాణ్‌కు చెన్నైలో, హైదరాబాద్‌లో ఉన్న నివాసాలపై దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
శ్రీనివాస కళ్యాణ్ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో మొత్తం రు.304 కోట్లమేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్లు తేలింది. దీనిలో కార్పొరేషన్ బ్యాంకు నుంచి రు.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రు.124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రు.60 కోట్లు తీసుకున్నారు. సెంట్రల్ బ్యాంకు ఆడిట్లో అతను నకిలీ ఇన్వాయిస్లతో రుణాలు తీసుకున్నట్లు తేలింది. సీబీఐ అధికారులు నిన్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లో ఉన్న అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. అతనిని త్వరలో ప్రశ్నించనున్నారని సమాచారం. విజయరామారావు నాడు సీబీఐ డైరెక్టర్‌గా సమర్థవంతంగా పనిచేశారని పేరు సంపాదించుకున్నారు. ఆయన కొడుకు ఈ విధంగా తండ్రి పరువును తీయటం విచారకరం. విజయరామారావు ఇటీవలే తెలుగుదేశానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే.