వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మరో సీబీఐ కేసు నమోదయింది. రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన కుటుంబసభ్యులు డైరక్టర్లుగా ఉన్న ఇండ్ భారత్ పవర్ కంపెనీ 273 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని చెన్నైలోని ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఈ నెల 23న సీబీఐకి ఫిర్యాదు చేశారు. బుధవారం రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నిజానికి రఘురామకృష్ణరాజుపై గతంలోనూ సీబీఐ కేసులు ఉన్నాయి. ఆయన ఇళ్లలో సీబీఐ సోదాలు కూడా చేసింది. ఆయన ఎగవేసిన సొమ్ము వేల కోట్లలోనే ఉంది. కానీ సీబీఐ అధికారులు.. ఎప్పుడో అవసరానికో ఎఫ్ఐఆర్.. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆయనపై సీబీఐ కేసులు అని ప్రచారం చేయడానికే ఉపయోగపడుతున్నాయి.
రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ కంపెనీ .. ఆ కంపెనీ ఉప కంపెనీలు మొత్తంగా మూడు వందల కోట్లు ఎగ్గొట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇండ్-భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్, ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా (ఐబీపీఐఎల్), ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్)లిమిటెడ్ .. ఇలా ఎక్కడ పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే.. అక్కడ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇలా దాదాపుగా పన్నెండు కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తామంటూ… ఈ కంపెనీలు దేశవిదేశాల్లోని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ , ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణాలు తీసుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రాజెక్టులు నిర్మించలేదు. తీసుకున్న రుణాలన్నీ దారి మళ్లించారు. ఈ రుణాలు 2016లోనే మొండి బకాయిలుగా మారాయి.
ఈ మొత్తం రుణాలు, ఎగవేతల వ్యవహారం.. దాదాపుగా రూ. 3వేల కోట్లు ఉంటుంది. ఈ కేసులన్నీ ఇప్పుడు కోర్టులతో పాటు.. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ వద్ద ఉన్నాయి. రుణాలు ఇచ్చిన కంపెనీలన్నీ… ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర చోట్ల కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆయాకంపెనీలను దివాలా తీసినట్లు ప్రకటించి.. తమ సొమ్ము తాము రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ.. ఇప్పుడు ఎస్బీఐ అధికారి మరోసారి ఫిర్యాదు చేశారు. మరో కేసు నమోదయింది. ఇదంతా రాజకీయ వ్యూహమేనని… తాను చట్ట పరంగా తేల్చుకుంటానని రఘురామకృష్ణరాజు అంటున్నారు.