ఆంధ్రప్రదేశ్లో సీబీఐ కేసుల్లో జరుగుతున్న విచారణ చూసి.. ప్రజలు ముక్కున వేలేసుకుటున్నారు. అటు డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర్నుంచి ఇటు వివేకా కేసు వరకూ.,. సీబీఐ అధికారుల విచారణ … తప్పనిసరి తంతులాగా సాగుతోంది. వివేకా కేసులో రోజూ పని మనుషుల్ని ప్రశ్నిస్తున్నారు. అలా ఎన్ని రోజులు ప్రశ్నిస్తారో వారికే తెలియదు. డాక్టర్ సుధాకర్ కేసులో ఆయన చనిపోయినా కేసు లో ఏం తేల్చారో తేలలేదు. ఇక న్యాయమూర్తులపై.. న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కేసుల్లో… నెలల తరబడి విచారణ చేస్తున్నారు. తప్పనిసరి అన్నట్లుగాఎవరినో ఒకరిని అరెస్ట్ చూపిస్తున్నారు. కానీ కేసు మాత్రం ముందుకు సాగడం లేదు.
ఇక ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కూడా సీబీఐ దాగుడు మూతలు ఆడుతోంది. పిటిషన్ విచారణకు స్వీకరించిన దగ్గర్నుంచి పదే పదే మాట మారుస్తోంది. ఓ అభిప్రాయానికి రాలేకపోతోంది. మొదట మూడు వాయిదాలు కోరి చివరికి మూడు లైన్ల కౌంటర్ వేశారు. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టుకే సలహా ఇచ్చారు.ఆ మాత్రం చెప్పడానికి మూడు వాయిదాలెందుకు కోరారనేది చాలా మందికి అర్థం కాలేదు. విచారణలో ఓ సారి లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని వెల్లడించారు.. మళ్లీ వాయిదాలో లిఖిత పూర్వక వాదనలు సమర్పించబోమని చెప్పారు.. మళ్లీ వాయిదాలో పది రోజుల గడువు ఇస్తే లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని వాదించారు. సీబీఐ తీరు చూసి.. విస్తుపోవడం మినహా ప్రజలకు మరో చాయిస్ లేకుండా పోయింది.
హైప్రోఫైల్ కేసులో అసలు సీబీఐకి ఎలాంటి అభిప్రాయం లేకపోవడం అంటే అందరికీ సందేహం వస్తుంది. సీబీఐ అభిప్రాయం అత్యంత కీలకం అయినప్పుడు మౌనం పాటిస్తే.. నేరస్తులకు అండగా ఉన్నారన్న భావన ప్రజల్లోకి వెళ్తుంది. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాల గురించి సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఎందుకు సంశయిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కొత్త సీబీఐ చీఫ్ వచ్చిన తర్వాత కూడా పనితీరులో మార్పు రాలేదా అన్నఅనుమానాలు ప్రారంభమవుతున్నాయి.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్, వివేకా కేసు… డాక్టర్ సుధాకర్ కేసు.. హైకోర్టు న్యాయమూర్తులపై తప్పుడు కేసుల ఫిర్యాదులే కాదు… ఆయేష్ మీరా తో పాటు పోలీసులపై రెండు సార్లు సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కానీ వాటి సంగతి మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. అలా విచారణ చేస్తూ టైంపాస్ చేస్తూంటే.. నిందితులకు భరోసాగానే ఉంటుంది.. ప్రజలకు మాత్రం.. సీబీఐపై నమ్మకం పోతుంది.