హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసిన కేసు ఇవాళ కొత్త మలుపు తిరిగింది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చుట్టుకునేటట్లు కనిపిస్తోంది. తమ సోదరుడు శ్రీనివాస్ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్‌లో గతంలో పనిచేశారని, వారు కుట్రచేసి తమ సోదరుడిని ఈ కేసులో ఇరికించారని విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడికి అన్ని వందలకోట్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. తన తండ్రి పార్టీ మారారన్న కక్షతో ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. శ్రీనివాస్ 2012లో ఈ రు.304 కోట్ల రుణాన్ని తీసుకున్నది సుజనా గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడేనని చెప్పారు. తప్పుడు పత్రాలను పెట్టి రుణాలు తీసుకున్నాడన్న ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. శ్రీనివాస్ త్వరలో మీడియా సమావేశం పెట్టి ఆ డబ్బు తన ఎకౌంట్ నుంచి ఎక్కడకు వెళ్ళాయో వివరిస్తారని తెలిపారు. నిజాలు త్వరలో బయటకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. సుజనా గ్రూప్‌పై మంచి ఆభిప్రాయం లేకపోవటంతో అక్కడ పనిచేయొద్దని తమ తండ్రి విజయరామారావు శ్రీనివాస్‌కు మొదటినుంచీ చెబుతూనే ఉన్నారని అన్నారు. వారు ఏదో ఒక స్కామ్‌లో ఇరికిస్తారని కూడా తమ తండ్రి చెప్పారని అన్నపూర్ణ తెలిపారు. సుజనా చౌదరికి నిన్నే మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్ట్ సమన్లు జారీ చేసి ఉండగా, ఇప్పుడు ఈ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది.