వివేకానందరెడ్డి హత్య కేసు అత్యంత కీలక మలుపు తిరగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరు ముఖ్యుల పీఏలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ పీఏల పని ఆ ప్రముఖుల ఫోన్లు పట్టుకోవడమే. అవినాష్ రెడ్డి కాల్ డేటాను విశ్లేషించిన సీబీఐ.. మొదట వివేకా హత్య గురించి వారికే తెలియచేశారు. ఆ తర్వాత చాలా సార్లు వారి మధ్య ఫోన్ కాల్స్ నమోదయ్యాయి. ఇప్పుడు ఈ ఇద్దరు పీఏలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఒకరి పేరు నవీన్ కాగా.. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. హైదరబాదాద్ సీబీఐ ఆఫీసులో వీరిని విచారించనున్నారు.
ఈ పరిణామాలు చూస్తూంటే… కేసు ” వివేకా మర్డర్ ప్లానర్స్” దగ్గరకు చేరినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ వివేకా కుమార్తె సునీత గతంలో ఇచ్చిన ఫిర్యాదు.. వాంగ్మూలం… ప్రకారం రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యులపై ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత అనేది సీబీఐ తేల్చడానికి అవకాశం ఏర్పడింది.
తన తండ్రిని హత్య చేశారని అప్పట్లో ప్రతిపక్ష నేత. తన సోదరుడు జగన్ కు .. వైఎస్ సునీత ఫోన్ చేస్తే.. అవునా అన్నారని .. కనీసం బాధ, ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయలేదని సునీత గతంలో సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారు. హత్య గురించి తెలిసిన తర్వాత ఎప్పుడో సాయంత్రానికి ఆయన రోడ్డు మార్గం ద్వారా కడపకు చేరుకున్నారు
వైఎస్ వివేకా హత్య కేసులో అప్పట్లో విచారణ సరిగ్గా సాగకుండా…. చేయడంలో కొంత మంది సక్సెస్ అయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఉండటంతో.. అప్పటికే అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదు. సీఎస్ ను మార్చేయడం… ఇంటలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కూడా తప్పించడంతో అధికారులు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తర్వాత ప్రభుత్వం మారింది. కేసులో న్యాయం జరగడం లేదని సునీత.. సీబీఐ విచారణ కోసం వెళ్లి విజయం సాధించడంతోనే కేసు మలుపు తిరిగింది. లేకపోతే ఎప్పుడో కేసును సునీత మీదకో.. మరొకరి మీదకో మళ్లించి క్లోజ్ చేసే వారన్న ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.
ప్రస్తుతం కేసులో ప్లానర్స్ తో పాటు ప్లాన్ ను అమలు చేసిన వారిని కూడా పట్టుకునేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. ఇందులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. అసలైన నిందితులు బయటకు వస్తే ప్రజలు కూడా పెద్దగా ఆశ్చర్యపోరు. రాకపోతేనే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ ఉంది.