వివేకా హత్య కేసును ఎవరూ తేల్చడం లేదు. ఏపీ పోలీసులు తేల్చలేదు. సిట్ల మీద సిట్లు వేసినా మార్పు రాలేదు. చివరికి హైకోర్టు సీబీఐకి ఇచ్చినా అదే పరిస్థితి. రెండు విడతలుగా సీబీఐ అధికారులు వచ్చి పోయారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో.. కడపలో అలాంటి హత్యలు కామనేనని.. సీబీఐ అధికారులు తనతో అన్నారంటూ .. వైఎస్ వివేకా కుమార్తె ఢిల్లీలో స్వయంగా ప్రకటించడంతో సీబీఐ అధికారులపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో వైసీపీ అధినేత.. సీఎం జగన్ .. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులతో వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం నేపధ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయంగా కలకలం రేపుతోంది.
తిరుపతి ఉపఎన్నికల్లో ఈ అంశం రాజకీయ పార్టీలకు ప్రధాన అంశంమయింది. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో తేల్చాలని డిమాండ్లు వినిపించడం ప్రారంభించాయి. సీబీఐపై అనుమానాలు ప్రారంభమవుతున్నాయని … రాజకీయ పరంగా ఓ హత్య కేసును సైతం దారి తప్పించేప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడం సీబీఐ విశ్వసనీయతమే తీవ్రంగా దెబ్బకొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మళ్లీ పెద్దగా హడావుడి లేకుండా నలుగురు సభ్యుల బృందం పులివెందుల చేరుకుంది. వారేం చేస్తారో.. ఇప్పటి వరకూ ఏం దర్యాప్తు చేశారో ఎవరికీ స్పష్టత లేదు.
కానీ.. ఏదో ఒకటి చేస్తున్నామనిపించడానికి మాత్రం వచ్చినట్లుగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కేసులో అయినా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించినవారే ప్రధాన అనుమానితులు. వివేకా కేసులో హత్యను సహజ మరణంగా నమ్మించి.. మృతదేహానికి కుట్లు కట్టి… రక్తం తుడిచేసిన వారు ఎవరో అందరికీ తెలుసు. కానీ ఇంత వరకూ వారిని మాత్రం ప్రశ్నించకుండా… కేసు విచారణ చేస్తున్నారంటే… సీబీఐకి ఎంత సీరియస్ నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.