ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ లక్ష్యంకాదని తాము ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకోలేదని, ఆయన కార్యాలయంలో పనిచేసే ఒక ఉన్నతాధికారి అవినీతిని నిరూపించడం కోసమే దాడి సెక్రెటేరియట్ లో దాడి చేశామని సిబిఐ ఇచ్చిన వివరణ చెత్తగా వుంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అత్యున్నత అధికారుల కార్యస్ధానమైన సచివాలయంలో తనిఖీలు నిర్వహించడానికి ఏ దర్యాప్తు సంస్థకైనా కఠినమైన నిబంధనలు, తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు ఉంటాయి. అందుకే కేంద్ర ప్రభుత్వానికి, అందులోనూ హోం మంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ సచివాలయంపై సిబిఐ అధికారులు దాడులకు దిగారంటే ఎవరూ నమ్మరు.
సిబిఐ చెబుతున్నదే నిజమైతే విషయం ఢిల్లీ ముఖ్యమంత్రితో ముందుగా ఎందుకు చర్చించలేదు. ప్రజాప్రయోజనాల రీత్యా రహస్యాలను కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కంటే సిబిఐ బాధ్యతే ఎక్కువ అవుతుందా ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా సిబిఐని అభివర్ణించిన బిజెపి అధినేతలు అధికారంలోకి రాగానే తమకూ కాంగ్రెస్ కీ తేడా లేదని రుజువు చేసిన మరో సంఘటన ఇది.
బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కొన్ని హిందూత్వ సంస్థలపై చేస్తున్న దర్యాప్తును సిబిఐ పక్కన పెట్టేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో హిందూత్వ సంస్థల ప్రమేయంపై జరుగుతున్న విచారణ ప్రక్రియ బిజెపి అధికారంలోకి రాగానే నీరుగారింది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో నిందితుడిగా ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విడుదలను అడ్డుకునే ప్రయత్నాన్ని సిబిఐ నామమాత్రంగా కూడా చేయలేదు. అదే సమయంలో 2002 గుజరాత్ మారణకాండను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన తీస్తా సెతల్వాద్‌పై కేసులు నమోదు చేయడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. కేంద్రంలో అధికారంలోవున్న వారి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం తప్ప సిబిఐ నిస్పక్షపాతంగా పని చేయడం లేదని అందరికీ తెలిసిందే.
ఇపుడు ఏకంగా ఒక రాష్ట్రప్రభుత్వం మీదే కక్షసాధించే పనికి సిబిఐ ఒక పనిముట్టుగా మారిపోయింది. ఢిల్లీలో గుడిసెల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపైనా, రైల్వేశాఖపైనా కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మరుసటి రోజే సిబిఐ దాడి జరగడం గమనార్హం. ఒక వ్యూహం ప్రకారం కేజ్రీవాల్ సర్కారు ప్రతిష్టను దిగజార్చడానికి సిబిఐని కేంద్ర ప్రభుత్వం పావులా వాడుకున్నదన్న అభిప్రాయమే తటస్ధవాదుల్లో వుంది..
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి, మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి సర్కారుకు అంతంతమాత్రంగానే ఉన్న సంబంధాలు తాజా సంఘటనతో మరింత దెబ్బతిన్నాయి. ఇది మోదీ, కేజ్రీవాల్ ల సొంత విషయంకాదు. ఫెడరల్ స్ఫూర్తికి ఉద్దేశ్యపూర్వకంగా భంగం కలిగిస్తున్న పెత్తందారీ పోకడల సమస్య…కాంగ్రెస్ ఇష్టారాజ్యాన్ని “ఎవడబ్బ సొమ్ము” అని అప్పుడు ఎన్ టి ఆర్ నిలదీశారు. అంతే తీవ్రతతో ఇపుడు కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ సచివాలయం పై సిబిఐ దాడుల్ని సమర్ధించుకోలేక బిజెపి నాయకులు ఇబ్బంది పడుతున్న సమయంలో కెజ్రీవాల్ అఫెన్స్ గేమ్ మొదలు పెట్టారు. ఢిల్లీ క్రికెట్ అసోసియషన్ వ్వహారాల్లో అవకతవకలపై ఒక కమీషన్ వేయదలచానని, అసోసియేషన్ చైర్మన్ గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్విహించిన ఆర్ధిక మంత్రి ఆ ఫైలుకోసమే సిబిఐ తో దాడులు చేయించారని ఆరోపించారు.
ఇకనైనా కేంద్రప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. రాష్ట్రాలతో స్నేహపూరిత సంబంధాలకు భిన్నంగా ఘర్షణాత్మక వైఖరి దేశాభివృద్ధికి ఏ మాత్రం దోహదం చేయదన్న అంశాన్ని గుర్తించాలి. ఇదే ఫెడరల్ స్ఫూర్తికి ఊపిరి!