విజయిసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. విజయసాయిరెడ్డితో పాటు సీబీఐకీ నోటీసులు జారీ చేసింది. పదో తేదీన తదుపరి విచారణ చేపట్టనుంది. నాలుగు రోజుల కింట విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా విజయసాయిరెడ్డి కలుస్తున్నారని.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
కొన్ని పాత విషయాలను కూడా రఘురామకృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సీబీఐ డైరక్టర్‌గా ఫలానా అధికారిని నియమిస్తున్నారని.. అయనను నియమించవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎంపీ హోదాలో లేఖ రాశారు. ఈ లేఖను తన పిటిషన్‌కు రఘురామకృష్ణరాజు జత చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఎంపీ స్పష్టంచేశారు.
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆరోపించారని.. న్యాయస్థానాలకు ఉద్దేశాలు ఆపాదించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణే కాకుండా న్యాయవ్యవస్థ పట్ల తీరు తెలిసిపోతుందన్నారు. ఈ పిటిషన్లో సీబీఐ కి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్లో తమకేమీ అభిప్రాయం లేదని.. కౌంటర్ వేయడానికి నిరాకరించిన సీబీఐ.. విజయసాయి విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.