వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితానికి సాక్షి మీడియా చేసినంత నష్టం చంద్రబాబు కూడా చెయ్యలేదేమో. 2014 ఎన్నికల సమయంలో కూడా జగన్‌కి కాన్ఫిడెన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళి బొక్క బోర్లా పడేలా చేసింది సాక్షినే. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా జగన్‌ని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేసేద్దామా అని తహతహలాడుతున్నారు అనే స్థాయిలో వార్తలు వండివార్చింది సాక్షి. తన సొంత మీడియా రాసిన వార్తలను జగన్ కూడా పూర్తి స్థాయిలో విశ్వసించినట్టున్నాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే చంద్రబాబు పోలింగ్ మేనేజ్మెంట్ తెలివితేటలను తక్కువ అంచనావేశాడు. ముఖ్యమంత్రి కుర్చీ ఆశలకు ఐదేళ్ళు గండిపడేలా చేసుకున్నాడు. సరేలే….ఐదేళ్ళ తర్వాత అయినా కుర్చీ నాదేలే అని సరిపెట్టుకుని గత మూడేళ్ళుగా ప్రజల అభిమానం పొందడం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాడు జగన్. 2019లో కుర్చీ ఎక్కడం ఖాయం అని ఆశిస్తున్న దశలో ఇప్పుడు సాక్షి మీడియా మరోసారి జగన్‌కి ఝలక్ ఇచ్చేలా ఉంది.
రీసెంట్గా సాక్షి మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి ఇంటర్యూని ప్రసారం చేసింది గుర్తుందా. ఇప్పుడు ఆ ఇంటర్యూనే జగన్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. జగన్‌పైన కేసులు నిలబడవు, ఆ కేసుల్లో విషయం లేదు, సరైన సాక్ష్యాధారాలు కూడా లేవు అంటూ జగన్‌కి ఫేవర్‌గా మాట్లాడేశాడు రమాకాంత్ రెడ్డి. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా రోజుల తరబడి టివిలో చూపించడానికి, పేజీల తరబడి ప్రచురించడానికి రెడీగా ఉండే సాక్షివారు పండగ చేసుకున్నారు. సిబిఐ పనితీరుపై రమాకాంత్‌రెడ్డి చేసిన విమర్శలను కూడా బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు ఆ సాక్షి ఇంటర్యూనే సాక్ష్యంగా చూపిస్తూ జగన్ బెయిల్‌ని కేన్సిల్ చేయమని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. సాక్షిలో ప్రసారమైన రమాకాంత్ రెడ్డి ఇంటర్యూ సాక్షులను ప్రభావితం చేసేలా ఉందని చెప్పుకొచ్చింది సిబిఐ. అలా చేయడం బెయిల్ నింబంధనలను ఉల్లంఘించడమే అని….అందుకే జగన్ బెయిల్‌ని కేన్సిల్ చేయాలని పిటిషన్ వేసింది సిబిఐ. సిబిఐ పిటిషన్‌ని సిబిఐ కోర్ట్ విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఏప్రిల్ 9 వరకూ జగన్‌కి టైం ఇచ్చింది. సాక్షి మీడియా వారి అత్యుత్సాహం పుణ్యమాని ఇప్పుడు జగన్ జైలుకు వెళితే మాత్రం 2019 ఎన్నికలపైన జగన్ పెట్టుకున్న ఆశలకు కూడా గండిపడడం ఖాయంగానే కనిపిస్తోంది.