ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు రిలీఫ్ లభించింది. వారి బెయిళ్లను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. రాజకీయ ఉద్దేశాలతోనే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారన్న జగన్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు రఘురామకొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం జగన్, విజయ సాయిరెడ్డిలకు ఊరట లభించినట్లయింది.
షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి .. సీఎంగా తన అధికారాన్ని ఉపయోగిస్తూ షరతులు ఉల్లంఘిస్తున్నారని… విజయసాయిరెడ్డి కూడా అదే పని చేస్తున్నారని వేర్వేరుగా రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై సీబీఐ ఎలాంటి అభిప్రాయం చెప్పకపోవడం జగన్, విజయసాయిలకు కలసి వచ్చింది. మెరిట్ ప్రకారం సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో సీబీఐ కోర్టు పిటిషన్ కొట్టి వేయడానికి ఎక్కువ చాన్సులున్నాయన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో మొదటి నుంచి వినిపించింది.
జగన్కు చెందిన సాక్షి మీడియాలో బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టి వేశారని సాక్షి మీడియాలో ముందుగానే ప్రచారం చేయడంతో సెప్టెంబర్ 14న హైకోర్టులో రఘురామ బెంచ్ మార్చాలన్న పిటిషన్ను ఎంపీ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేయడంతో తీర్పు చెప్పడానికి మార్గం సుగమం అయింది. పిటిషన్ల కొట్టివేతపై స్పందించిన రఘురామకృష్ణ రాజు సాక్షిలో వచ్చిన వార్తే నిజమైందన్నారు. త్వరలో హైకోర్టులో అప్పీల్ చేస్తానని ఒక వేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు.