“సొమ్ములు పోనాయి… మరేటి సేత్తాం..!” … అని బొత్స సత్యనారాయణ.. ట్రేడ్ మార్క్ డైలాగ్.. చెప్పుకోవాల్సి వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ కేసు జూలు విదిల్చింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు బొత్స సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ ఫోక్స్ వ్యాగన్ కేసులో… నిందితులుగా హెల్మెట్ షూస్టర్, అశోక్ కుమార్ జైన్, జగదీశ్ అలగరాజా, గాయత్రీ చంద్రవదన్, బీకే చతుర్వేదిలు ఉన్నారు. వీరితో పాటు వశిష్ట వాహన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా.. ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించింది.
అసలు ఫోక్స్ వ్యాగన్ స్కామేంటి..?
గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఏపీలో ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. వైఎస్ సర్కార్ ఏర్పడింది. అప్పుడే.. గోల్ మాల్ జరిగింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ బోర్డు సభ్యుడు హెల్మత్ షుష్టర్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వ వాటాగా రూ. 11 కోట్ల 60 లక్షలు చెల్లించాలని కోరారు. పరిశ్రమ పెట్టడానికి వచ్చిన వారికి డబ్బులు ఎందుకు చెల్లించాలో… అప్పటి రవాణా మంత్రి కొంత కూడా ఆలోచించలేదు. ఫోక్స్‌వ్యాగన్‌కు ఇండియాలో అనుబంధ సంస్థ అంటూ వశిష్ట వాహన్ సంస్థ పేరు మీద 11 కోట్ల 60 లక్షలను విడుదల చేయించారు. డబ్బులు వశిష్ట వాహన్ ఖాతాలో పడగానే ఆ డబ్బులు డ్రా చేసుకొని నిందితులు పరారయ్యారు.
అప్పటి రవాణా మంత్రి బొత్సపైనే ప్రధానంగా ఆరోపణలు..!
అప్పట్లో రవాణా మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ ను.. విశాఖ- విజయనగరం మధ్యలో పెట్టించాలని..ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ఆ పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారు. అక్కడే ప్లాంట్ పెట్టించడానికి తాపత్రయపడ్డారని ప్రచారం చేసింది. ఆయన తాపత్రయాన్ని అర్థం చేసుకుని.. స్కాంకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి.. ఇదంతా బొత్సకు తెలిసే జరిగిందని.. తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి సీఎం వైఎస్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. అప్పుడు… కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్సే ఉంది. సీబీఐ కూడా.. దానికి తగ్గట్లే బొత్సకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే కుట్రలో షుష్టర్తోపాటు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రతినిధి జైన్, వశిష్ట వాహన్ సంస్థ, డైరెక్టర్లు గాయత్రి చంద్రవన్, బీకే చతుర్వేది, జోసెఫ్ వి జార్జ్‌లతో పాటు బెంగుళూర్‌కు చెందిన విద్యాసంస్థల చైర్మన్ జగదీష్ అలగరాజులను నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే లెక్కా పత్రం లేకుండా వోక్స్ వ్యాగన్ పేరు మీద వశిష్ట వాహన్‌కు 12 కోట్ల చెల్లింపు చేయడంలో… ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఎలా ఉంటుందన్న… అనుమానాలు సహజంగానే అందరిలోనూ ఉన్నాయి. తనకూ ఏమీ తెలియదని చెప్పుకోవడానికి…” సొమ్ములు పోనాయి.. మరేటి సేత్తాం..” అని బొత్స కవర్ చేసుకున్నాయి.
ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది..?
2005లో జరిగిన ఈ రూ. 11 కోట్ల 60 లక్షల స్కాంపై.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాంపల్లిలోని ఈడీ కోర్టులో 2015 ఏప్రిల్ లో చార్జిషీట్ దాఖలు చేసింది. అంతకు ముందే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న ఈడీ మనీలాండరింగ్ కింద నిందితుల ఆస్తులను జప్తు చేయడంతోపాటు శిక్ష విధింపు కోసం చార్జిషీట్ దాఖలుచేసింది. వాటిపై విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. తాజాగా.. ఏపీ మంత్రి బొత్సకు.. నోటీసులు జారీ అయ్యాయి. బొత్స ఈ కేసులో ఏం చెబుతారన్నది ఆసక్తికరం.