సీబీఐ సీరియల్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీ పదవి నుంచి తప్పించిన అలోక్ వర్మ.. రాజీనామా చేసేశారు. తనకు కేటాయించిన ఉద్యోగంలో చేరకుండా… అసలు ఉద్యోగానికే రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన ఈ నెల 31న రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. తనకు సహజ న్యాయసూత్రాలను కూడా వర్తింప చేయకుండా.. అవమానించారని.. అలోక్ వర్మ ఆరోపిస్తున్నారు. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపైనే తనపై చర్య తీసుకున్నారని అలోక్ వర్మ అసంతృప్తి వ్యక్తం చేసి.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరో వైపు మళ్లీ మధ్యంతర సీబీఐ డైరక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు.. అలోక్ వర్మ… బదిలీ చేసిన ఐదుగురు అధికారులను .. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశించారు. అలోక్ వర్మ బదిలీలను రద్దు చేశారు.
మరో వైపు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్ధానాతో పాటు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్, దళారి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు ఆస్ధానా సహా ఇతరులపై నమోదైన కేసు విచారణను పది వారాల్లోగా పూర్తిచేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అయితే.. రాకేష్ ఆస్థానాపై ఉన్న ఆరోపణలు.. ఆయనకు ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల… ఆయనకు వచ్చే ఇబ్బందేమీ లేదని భావిస్తున్నారు. అయితే సీబీఐ డైరక్టర్ అయ్యే అవకాశాన్ని మాత్రం కోల్పోతారు.
మరో వైపు.. సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మ తొలగింపు వ్యవహారం.. కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమయింది. రాఫెల్ స్కాంలో ఎప్ఐఆర్ నమోదు చేస్తారనే భయంతోనే మోదీ ఉన్న పళంగా బదిలీ చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ అయింది.