ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అత్యంత వివాదాస్పద మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై సీబీఐ విచారణ చేయించాలంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనికి కారణం.. ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర పేకాట క్లబ్ వ్యవహారమే. కొన్నాళ్ల క్రితం.. కర్నూలు జిల్లాలోని.. మంత్రి జయరాం స్వగ్రామం అయిన గుమ్మనూరులో పెద్ద ఎత్తున సాగుతున్న పేకాట క్లబ్‌ను పోలీసులు మూసివేయించారు. జయరాం దగ్గరి బంధువుల్ని అదుపులోకి తీసుకున్నారు. అది మంత్రి అండదండలతో కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న పేకాట క్లబ్ అని… ప్రచారం జరిగింది.
అయితే.. ఆ కేసులో పోలీసులు ఎవర్ని అరెస్ట్ చేశారో.. ఎవరిపై కేసులు నమోదు చేశారో… స్పష్టత లేదు. దీనితో ప్రభుత్వం నిందితుల్ని తప్పించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమంయలో… గుమ్మనూరు పేకాట వ్యవహారంపై మంత్రి జయరాం పాత్రను తేల్చాలని.. సీబీఐ విచారణ చేయించాలని పిటిషన్ దాఖలయింది. మంత్రి జయరాంను ప్రతివాదిగా చేర్చారు పిటిషనర్. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు అనుమతించింది. ఒక్క పేకాట వ్యవహారమే కాదు.. మంత్రి జయరాం.. వందల కొద్ది భూముల కొనుగోలు … ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి కారును గిఫ్ట్‌గా తీసుకోవడం వంటి వివాదాల్లోనూ ఇరుక్కున్నారు.
ఇప్పుడు.. ఆయనకు పేకాట వ్యవహారంలో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆ పేకాట క్లబ్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని జయరాం వాదిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో హైకోర్టులో పిటిషన్ వేయడం.. మంత్రికి మరిన్ని చిక్కులు తీసుకొచ్చి పెట్టే అవకాశం కనిపిస్తోంది.