అక్రమ నిర్బందం కేసులో మొన్న నేరుగా.. పోలీస్ బాస్ డీజీపీ గౌతం సవాంగ్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. న్యాయస్థానం.. నేరుగా.. ఆయనకే చివాట్లు పెట్టినంత పని చేసింది. చట్టం ప్రకారం.. విధులు నిర్వహించాల్సిందేనని.. స్పష్టం చేసి పంపింది. ఆ విషయం.. సంచలనాత్మకం అవుతూండగానే… ఈ సారి హైకోర్టు ఏకంగా పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇది కూడా అక్రమ నిర్బంధం కేసులోనే.
ఏపీని బీహార్ కన్నా దారుణంగా చేసిన ఏపీ పోలీసులు ..!
“అక్రమ నిర్బంధం పిటిషన్లు బిహార్లో చాలా తక్కువ దాఖలు అవుతున్నాయి. ఏపీలో అందుకు భిన్నంగా చాలా దాఖలవుతున్నాయి. పోలీసు పరిపాలనా విధానం చూస్తుంటే ఎమర్జెన్సీని తలపించేదిగా ఉంది. పోలీసులు చట్ట నిబంధనలను అనుసరించడం లేదు..” సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఏపీ పోలీసుల తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవి చాలా తీవ్రమైనవి. శాంతిభద్రతల అంశంలో బీహార్ పరిస్థితిని ఎవరూ కోరుకోరు. అక్కడి పోలీసుల పనితీరు.. ప్రైవేటు సైన్యంలా ఉంటందనే ఆరోపణలు ఉన్నాయి. చట్టాలను లెక్క చేయకుండా.. పోలీసులకే కిడ్నాప్లకు పాల్పడటం.. వంటి చర్యల ద్వారా.. బీహార్ అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇప్పుడు అంత కంటే దారుణమైన పరిస్థితి ఏపీలో ఉందని.. హైకోర్టు తన వ్యాఖ్యల ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పోలీసులే అపహరిస్తే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి..!?
పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రం.. అన్నింటికీ అతీతులు కాదు. ఇష్టం వచ్చినట్లుాగ ఎవరిని పడితే వారిని తీసుకెళ్లిపోవడం.. కొట్టడం.. నిర్బంధించడం.. వారి హక్కు కాదు. విధి నిర్వహణ చట్ట ప్రకారమే ఉండాలి. అలా కాకుండా.. బలవంతంగా అపహరించి.. వారిని నిర్బంధంలో ఉంచి.. అరెస్ట్ చూపించకుండా… హింసిస్తే.. అది సంఘవిద్రోహచర్యే అవుతుంది. సాధారణ కిడ్నాపర్లకు పోలీసులకు పెద్దగా తేడా ఉండదు. పోలీసులు ఇలా చేస్తున్నారని అనేక సార్లు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో.. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన రూలింగ్స్ ఇచ్చింది. ఎవరినైనా అదుపులోకి తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో.. అరెస్ట్ చూపించాల్సిందేనన్న నిబంధనలు ఉన్నాయి. కానీ.. ఏపీలో పోలీసులు.. ఆ నిబంధనలు ఏవీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా.. ఎవరిని పడితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వివాదం చెలరేగిన తర్వాత ఏ బెట్టింగ్ కేసో.. ఓ చిల్లర గొడవో.. కేసు పెట్టి అరెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి వరకూ వారిని చిత్రహింసలు పెడుతున్నారు.
రాజకీయ నేతల కోసమే పోలీసులు ఇలా చేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు కొన్ని నెలలుగా విమర్శలు పాలవుతున్నాయి. కొంత మందికి ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారని.. విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు.. ఇతర పార్టీల పై… అత్యంత దారుణమైన దూషణలతో పోస్టులు పెట్టినా.. పోలీసులు పట్టించుకోరు. కానీ.. ఇతర పార్టీలకు చెందిన వారు.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించినా.. వదిలి పెట్టలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. చెబితే.. ఎవరినైనా పోలీసులు అపహరంచి తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. పలు ఘటనలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. పోలీసులు వదిలేశారు. నిజానికి అలాంటి పోస్టులు చట్ట విరుద్ధం కాదు. కానీ.. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు.. అపహరించి .. ఆయా స్టేషన్లకు తీసుకెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతే గడ్డు కాలమే..!
ఇప్పటి వరకూ చాలా పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ పోలీసులు ఇంత దారుణంగా.. చెడ్డ పేరు తెచ్చుకున్న సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. నేరుగా పోలీస్ బాస్.. హైకోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి… అక్రమ నిర్బంధాలపై.. సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిన దుస్థితికి.. ఏపీ పోలీసులు దిగిపోయారు. పోలీసు వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అదే జరిగితే.. గడ్డుకాలమే.,