తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు రంగం సిద్ధమయింది. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతిచ్చింది. అక్రమ మైనింగ్ చేశారంటూ గతంలో కోర్టుకు సీఐడీ నివేదిక సమర్పించింది. ఆంధ్రా బ్యాంకులో యరపతినేనికి సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగాయని సీఐడీ హైకోర్టుకు నివేదికించింది. సీబీఐ విచారణ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ కే వదిలేసిన హైకోర్టు.. బుధవారం లోపు.. నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇప్పటికే.. సీబీఐని ఏపీలో కేసులు చేపట్టేందుకు అవసరమైన జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించినందున.. ఇక విచారణకు ఆదేశించడమే తరువాయన్న చర్చ జరుగుతోంది.
గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ… 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని… ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి దీనిపై మరో పిల్ వేశారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని .. ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.
టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు… అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారి దగ్గర్నుంచి నష్టపరిహారం రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖజానాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు… కాగ్‌తో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అంతే కాదు.. ఈ కేసులో తదుపరి ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలంటూ.. కాగ్, సీబీఐ డైరక్టర్, కేంద్రగనుల శాఖలను .. ఈ కేసులో సుమోటోగా హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. అయితే.. దీనిపై గతంలో విచారణ జరిపిన ప్రభుత్వ అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కానీ వారు కూలీలే. అసలు వ్యక్తుల్ని వదిలేసి కూలీలపై కేసులు పెట్టడమేమిటని హైకోర్టు మండిపడింది. ఆ విచారణకు సంబంఁధించిన తాజా ఆదేశాల ప్రకారం.. సీబీఐ విచారణ జరిపంచాలో లేదో ఏపీ సర్కార్ కే హైకోర్టు అవకాశం ఇచ్చింది. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసు విషయంలో సీఐడీ విచారణను.. వ్యతిరేకించిన వైసీపీ సర్కార్ సీబీఐ విచారణను డిమాండ్ చేసింది. ఇప్పుడు.. సీబీఐ విచారణ చేయిస్తుందో.. సీఐడీ తమ చేతుల్లోనే ఉంటుందికాబట్టి… సీఐడీ విచారణ చాలని అనుకుంటుందో.. రెండు రోజులలో తేలిపోతుంది.