సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రోజున ఆయన… తన కొత్త పార్టీ జెండా, అజెండాను ప్రకటించబోతున్నారు. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్‌గా ఉన్న లక్ష్మినారాయణ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. అన్ని వర్గాల సమస్యలను పరిశీలించారు. తను పరిశీలిచిన సమస్యలతో ఓ పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేశారు. తన అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణం ఉండే పార్టీలతో కలసి పని చేసేందుకు సిద్ధమని.. లక్ష్మినారాయణ పదే పదే ప్రకటించారు.
సత్యం కంప్యూటర్స్ కేసు, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి… ఆంధ్రప్రదేశ్‌లో వీవీ లక్ష్మినారాయణ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనను తమ పార్టీలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు .. ప్రయత్నించారు. రామ్‌మాధవ్ లాంటి నేతలు.. నేరుగానే ఆహ్వానం పంపారు. మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా.. తమ పార్టీలో చేరి… ఏపీ తరపున బాధ్యతలు తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. కానీ వీవీ లక్ష్మినారాయణ మాత్రం.. సొంత పార్టీకే మొగ్గు చూపారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని ఆయన ఇప్పటికే పలుమార్లు తన ఆలోచనలు చెప్పారు. కడప జిల్లాకు చెందిన లక్ష్మినారాయణ…విద్యాభ్యాసం కర్నూలు జిల్లాలో జరిగింది.
సివిల్ సర్వీస్ అధికారులు పార్టీలు పెట్టడం కొత్త కాదు. ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి.. ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ.. దక్షిణాదిలో మాత్రం అలాంటి ప్రయోగాలు విఫలమయ్యారు. ఐపీఎస్లా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని లోక్‌సత్తా పేరుతో కొంత కాలం.. సంస్థను నడిపిన జయప్రకాష్ నారాయణ… ఆ తరవాత దాన్ని పార్టీగా మార్చారు. ప్రజల మద్దతు పొందలేకపోయారు. చివరికి పార్టీలో కుమ్ములాటలు భరించలేక… రాజకీయ పార్టీని విరమిచుకుంటున్నట్లు ప్రకటించారు. మరి వీవీ లక్ష్మినారాయణ రాజకీయ జీవితం.. కొత్త పార్టీతో ఎలా సాగుతుందో మరి..!