సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ.. తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపుగా ఖరారయింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన ఆయన.. అప్పట్నుంచి రెండు నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. ఏదైనా పార్టీ నుంచి ఆహ్వానం వస్తే.. చేరాలని అనుకున్నారు. బీజేపీ, జనసేన ఆహ్వానించాయి కానీ.. ఆయన చేరలేదు. ఇప్పుడు.. తెలుగుదేశం పార్టీ ఆయనను ఆహ్వానించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయి.. టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా టీడీపీలోకి రావడానికి అంగీకరించారు. భీమిలి అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు గంటా, లోకేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే.. వీవీ లక్ష్మినారాయణ కోసం వీరిద్దరూ పక్కకు తప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు.
జేపీ స్థాపించిన లోక్‌సత్తా పార్టీని ఆయన నడిపిస్తారని… ప్రచారం జరిగింది. కానీ.. సొంత పార్టీని పెట్టుకోవడం అంత ఈజీ కాదని అర్థమయింది. అందుకే ఆయన… టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో.. ఆయన వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కలిశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ను కలిసి సంఘిభావం తెలిపారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించి.. ప్రస్తుతం జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సమావేశమయ్యారు. రైతుల కోసం ఏదైనా చేయాలన్న ఆశయంతో ఆయన ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తే వ్యవసాయ మంత్రిని అవుతానని గతంలో చెప్పేవారు.
సీబీఐ జేడీ చేరికను.. టీడీపీ వర్గాలు దాదాపుగా నిర్దారించాయి. అయితే పోటీ చేసే స్థానంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నాయి. ఆయన స్థాయికి..ఎంపీ సీటు కరెక్ట్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ, ఒంగోలు ఎంపీ స్థానాలను… కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని అనుకుంటున్నారు. బహుశా… అసెంబ్లీకి కాకపోతే… పార్లమెంట్‌కు పోటీ చేయాల్సి వస్తే.. ఆయనను ఈ రెండు చోట్ల ఒకచోట నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది.