విచారణకు పెద్దగా సహకరించకపోయినా ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా వరకూ స్మూత్ గా విచారణ కొనసాగించాలనుకుంటోంది. నోటీసులు ఇచ్చిన మూడు సార్లు రెండు సార్ల తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పి డుమ్మ కొట్టినా మ రో తేదీ ఇస్తున్నారు. తాజాగా సోమవారం సీబీఐ ఎదుట హాజరు కావాలని ఇచ్చిన నోటీసులకు.. తాను రాలేనని సమాచారం ఇచ్చారు. దాంతో సీబీఐ అధికారులు పదో తేదీ గడువిచ్చారు పదో తేదీ రావాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని అవినాష్ రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 10న సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు సమావేశంలో అవినాష్ రెడ్డి ప్రకటించారు. పన్నెండో తేదీ తన తండ్రి భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరవుతారని తెలిపారు. మామూలుగా అయితే అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లకు… విచారణకు హాజరయ్యేందుకు ఆయన పెడుతున్న వంకల కారణంగా .. విచారణకు సహకరించని కారణంగా అరెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ సీబీఐ అధికారులు ముందుగా అరెస్టుల కన్నా అసలు దర్యాప్తు పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
వివేకా హత్య జరిగిపోయి నాలుగేళ్లు దాటిపోయిది. సీబీఐ చేతికి వెళ్లి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో సీబీఐపైనా ఒత్తిళ్లు తప్పడం లేదు. అయినా కేసును ముందుకు నడిపిస్తున్నారు. మూడో సారి అవినాష్ రెడ్డి విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.