వివేకా హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు చురుకుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే.. కేసు విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రికార్డులు తీసుకున్నారు. వివేకా ఇంటిని పరిశీలించారు. అక్కడ కొలతలు తీసుకున్నారు. వివేకా కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు… అనుమానితుల విచారణకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. 2019, మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణం ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. మొదటి నుంచి ఈ కేసు మిస్టరీనే. మొదట గుండెటపోటు అని నమ్మంచడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.
ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా.. గుండెపోటుతో మరణించారని.. ఉదయం పది గంటల సమయంలో ప్రకటించింది. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటంచారు. అయితే.. అసలేం జరిగిందో.. కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకా.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని.. తేలిపోయింది. డెడ్‌బాడీ పోస్టుమార్టానికి వెళ్లే వరకూ… ఎవరూ… ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం… వివేకా గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచి పెట్టి… సాక్ష్యాలను తారుమారు చేసి… స్మూత్‌గా… అంత్యక్రియలు జరిపించేయాలని… ప్రయత్నించారని ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది.
జగన్ సీఎం అయిన తర్వాత రెండు సార్లు దర్యాప్తు బృందాలను మార్చారు. కానీ కేసు విచారణను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. సాంకేతిక సాక్ష్యాలు బలంగా ఉన్నందున… కొంత మంది వీఐపీ అనుమానితుల్ని సీబీఐ ప్రశ్నించడం ఖాయంగా కనిపిస్తోంది. కొంత మంది పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారే ప్రధాన నిందితులవుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరి బంధువులే.. సాక్ష్యాలు తుడిచేసే ప్రయత్నాలు చేయడం.. మృతదేహానికి కట్లు కట్టడంతో వారందర్నీ సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు.