వైఎస్ వివేకా హత్య కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా సీబీఐ గుర్తించిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను … సీబీఐ రద్దు చేయించలేకపోయింది. ఎర్ర గంగిరెడ్డిని ఏపీ పోలీసులు వివేకా హత్య జరిగినప్పుడే..2019 మార్చిలో సాక్ష్యాలను నాశనం చేశారన్న కేసులో అరెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత జూన్‌లో ఆయనకు కడప కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పుట్నుంచి ఆయన బయటే ఉన్నారు. కేసు సీబీఐకి తీసుకున్న తర్వాత ఎర్రగంగిరెడ్డినే హత్యలో కీలక పాత్రధారి అని సీబీఐ గుర్తించింది.
దస్తగిరి వాంగ్మూలంతో ఉమా శంకర్ రెడ్డితో పాటు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను సీబీఐ అరెస్ట్ చేసింది. కానీ బెయిల్ పై ఉన్నందున గంగిరెడ్డిని మళ్లీ జైలుకు తరలించలేకపోయింది. ఆయన పాత్రపై స్పష్టమై నఆధారాలు లభించడంతో డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ముందుగా కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ సానుకూల నిర్ణయం రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడా సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించాడా? సాక్షులను బెదిరించాడా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది.
విచారణలో తమను బెదిరిస్తున్నారని సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. అయితే సీబీఐ వాదనను హైకోర్టు తిరస్కరించింది. సాక్షులను బెదిరించారన్నదానికి ఆధారాలు లేవని.. సీబీఐ పిటిషన్‌ను కొట్టి వేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చివరికి వచ్చింది ఎప్పుడైనా తుది చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు రాజకీయంగా హై ప్రోఫైల్ కేసు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా అవినాష్ రెడ్డికి మద్దతుగా ఉంటూండటంతో… ఈ కేసు మొత్తం రాజకీయం అయిపోయింది.