సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ సారి ఏదో కారణం చెప్పి విచారణను ఆలస్యం చేయిస్తున్నారని ఆయన పారిస్ పర్యటనకు వెళ్లనివ్వొద్దని కోర్టులో సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమార్తె హర్షా రెడ్డి గ్రాడ్యూయేషన్ వేడుకలో పాల్గొనేందుకు తనకు పారిస్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ షరతుల్లో పాస్ పోర్టును కోర్టు అధీనంలో ఉంచడం కూడా ఒకటి. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదు.
అందుకే ఎప్పుడు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా ఆయన కోర్టు అనుమతి తీసుకుంటారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతపెద్దగా విదేశాలకు వెళ్లలేదు. సీఎం అయిన తర్వాత ఓ సారి జెరూసలెం.. మరోసారి అమెరికా… వెళ్లారు. రెండు సార్లు విహారయాత్రలకు వెళ్లారు. మొత్తం మీద నాలుగైదు సార్లు మాత్రమే వెళ్లారు. అయితే ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లాలని పిటిషన్ పెట్టుకున్న కోర్టు అనుమతి ఇస్తోంది.
సీబీఐ మాత్రం పర్మిషన్ ఇవ్వవొద్దని కౌంటర్ వేస్తూనే ఉంది. కేసుల విచారణ ఆలస్యమవుతోందని వాదిస్తూనే ఉంది. అయితే కోర్టులో ఆ వాదనలు నిలబడటం లేదు. జగన్కు పర్మిషన్ లభిస్తోంది. ఈ సారి కూడా జగన్ కు ప్యారిస్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని వైసీపీ వర్గాలు చెబుతాయి. జగన్ పర్యటన ఎప్పటి నుండి ఎప్పటి వరకూ అనేది తేలాల్సి ఉంది.