సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వవద్దని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ .. సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. తాను ముఖ్యమంత్రి అయ్యానని.. ఏపీ లోటు బడ్జెట్లో ఉందని.. తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం వల్ల… ప్రజాధనం ఖర్చు అవుతుందనే కారణంతో… వైఎస్ జగన్… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ.. సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో.. సీబీఐ తన కౌంటర్‌ను దాఖలు చేసింది. ఈ కౌంటర్లో కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ.. జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.
జగన్ వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని తెలిపింది. జగన్ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని.. ఇప్పుడు సీఎం పదవిలో ఉన్న జగన్.. సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కౌంటర్లో వాదించింది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చే కారణం కాదని సీబీఐ స్పష్టం చేసింది. విజయవాడ నుంచి వారానికోసారి రావడం.. కష్టమేమీ కాదని కౌంటర్లో సీబీఐ స్పష్టం చేసింది. జగన్ పిటిషన్, సీబీఐ కౌంటర్‌పై శుక్రవారం కోర్టు వాదనలు విననుంది.
సాధారణంగా… విచారణ సంస్థలు అభ్యంతరం చెప్పకపోతేనే.. కోర్టు మినహాయింపు లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించే సమయంలో… సీబీఐ న్యాయవాదులు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత బెయిల్ షరతుల సడలింపు సమయంలోనూ.. అదే పరిస్థితి. కానీ ఇప్పుడు.. వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో మాత్రం సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం.. జగన్ తరపు న్యాయవాదుల్లోనూ కలకలం రేపింది.