వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మెల్లగా అసలు నిందితుల వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వివేకా నందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్నా ఎందుకు సాధారణ మరణంగా.. గుండె పోటుతో మరణించారని నమ్మించడానికి ప్రయత్నించారన్న దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. మొదటగా ఎంపీ అవినాష్ రెడ్డి పీఏలు ఇద్దర్ని ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అదేసమయంలో సాక్షి దినపత్రిక కడప జిల్లా రిపోర్టర్ బాలకృష్ణారెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా వీరే వివేకానందరెడ్డిది గుండెపోటు అని అందరికీ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఎవరు అలా చెప్పమన్నారని సీబీఐ అధికారులు ఆరా తీసినట్లుగా చెబుతున్నారు.
మరో వైపు వివేకా హత్య జరిగినరోజున ఉదయం నుంచి ఆయనది గుండెపోటే అని ప్రచారం చేశారు. సాక్షి మీడియాలోనూ అదే వచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లోటస్ పాండ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించడం బాధాకరమని సంతాపం ప్రకటించారు. కానీ అప్పటికి వివేకానందరెడ్డికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయినప్పటికీ అనుమానాస్పద మరణంగా కూడా చెప్పలేదు. పోస్ట్ మార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో చివరికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అందులో పెద్ద ఎత్తున గాయాలు బయటపడ్డాయి. అప్పుడు మాత్రమే హత్య అని ఒప్పుకుని టీడీపీ నేతలపై ఆరోపణలు ప్రారంభించారు.
నేరం చేసిన వారే సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేస్తారని పోలీసులు ప్రధానంగా అనుమానిస్తారు. వివేకా హత్య జరిగిన రోజంతా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి రాక ముందు వరకూ…అక్కడ ఉన్న వారంతా సాధారణ మరణంగానే నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వారిని సీబీఐ ఇంత వరకూ ప్రశ్నించలేదు. చాలా రోజుల తర్వాత ఈ కోణంలో అధికారులు ప్రశ్నలు ప్రారంభించారు. ఈ వైపు నుంచి తీగలాగడం ప్రారంభమైతే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.