అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అవకాశం ఇవ్వవొద్దని హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగానే గతంలో హైకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని .. ఇప్పుడు జగన్ హోదా పెరిగినందున మరితంగా సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. పదేళ్లుగా అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు వేస్తున్నారని.. ఇప్పటికి క్వాష్ పిటిషన్ల దగ్గరే పలు కేసులు ఉన్నాయన్నారు.
హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యమవుతుందని సీబీఐ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. గత శుక్రవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో వారంలో 5 రోజులు కోర్టుకు హాజరు కాలేనని.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి కావడం వల్ల పాలనా పనులతో పాటు ప్రొటోకాల్ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నారు. నిజానికి అటు సీబీఐ కానీ.. ఇటు జగన్ కానీ.. ఇరువులు … హాజరు మినహాయింపు పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ఒకటే వాదన వినిపిస్తున్నారు.
తాను సీఎం అయ్యానని ప్రజా బాధ్యతలు పెరిగాయని జగన్ అంటున్నారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ అంటోంది. గతంలో ఇలాంటివాదనలు విన్న దిగువ కోర్టు వ్యక్తిగత హాజరు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం విచారణ జరిగినప్పుడల్లా రకరకాల కారణాలతో సీఎం జగన్ హాజరు మినాహయింపు పొందుతున్నారు.