భారతీయ జనతా పార్టీకి అసలైన మిత్రపక్షం… ఎవరు అంటే.. సీట్ల కోసం బ్లాక్ మెయిల్ చేసే పార్టీలు కానే కాదు.. ఆ పార్టీకి అసలైన మిత్రపక్షాలు ఎవరంటే… రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థలేనని… బీజేపీ అంటే గిట్టని పార్టీలు చెబుతూ ఉంటాయి. సీబీఐ, ఈడీ సహా… దర్యాప్తు సంస్థలన్నింటినీ… తమ మిత్రపక్షాలుగా చేసుకుని.. రాజకీయ వ్యూహాలను… ప్రత్యర్థులను జైళ్లకు పంపడం ద్వారా అమలు చేస్తూంటారని చెబుతూంటారు. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర్నుంంచి.. శశికళ వరకు అనేక ఉదాహరణలు కూడా చెబుతూ ఉంటారు. అలాగే.. అస్మదీయులైన నేతలు.. ఎంత భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఎంత కులాసాగా బయటక తిరుగుతూ ఉంటారో… గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి నేతల్ని ఉదాహరణగా చూపిస్తూంటారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి.. వీటన్నింటినీ.. ఆరోపణలుగానే పరిగణించాలి. అయితే.. ఇప్పుడు ఓ కొత్త ఆరోపణ తెరపైకి వచ్చింది. అదేమిటంటే… యూపీలో బీజేపీ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను సీబీఐ తీసుకుందట..!
వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే… యూపీలో సీట్లు సాధించడమే కీలకమని.. బీజేపీకి అర్థమయిపోయింది. అఖిలేష్, మాయావతి పొత్తులు పెట్టుకుంటే.. అక్కడ బీజేపీ పరిస్థితి ఊహించనంత దిగువ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే.. ఉపఎన్నికల ద్వారా తేలిపోయింది. ఇప్పుడు.. సార్వత్రిక ఎన్నికల్లోనూ అఖిలేష్, మాయావతి పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధయ్యారు. సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ లోపే.. సీబీఐ రంగంలోకి దిగింది. ఇసుక అక్రమ తవ్వకాల్లో అఖిలేష్ పాత్ర ఉందంటూ.. హడావుడి ప్రారంభించింది. ఈ కేసులో కోర్టు ఆదేశాల పేరుతో… యూపీ క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి చంద్రకళ సహా.. అనేక మంది ఎస్పీ నేతల ఇళ్లపై దాడులు, సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అఖిలేష్ పేరు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు.
అక్రమాలు జరిగాయని.. చెబుతున్న కాలంలో.. అఖిలేష్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనను విచారించబోతున్నామని సీబీఐ ఇప్పటికే… మీడియాకు సమాచారం ఇచ్చి.. రాజకీయం
ప్రారంభించేసింది. అఖిలేష్ సీఎంగా ఉన్న సమయంలో 2012-13 మధ్యలోనే ఈ అక్రమాలు జరిగినట్లు సీబీఐ చెబుతోంది. ఈ కేసులో ఆయనకు కూడా సమన్లు పంపించి అఖిలేష్‌ను ప్రశ్నించనున్నట్లు సీబీఐ అధికారులు ఓ మాదిరిగా బ్లాక్మెయిల్ ప్రారంభించారు. యూపీలో కూటమి కట్టడం లేదని… ఫీలర్లు పంపితే.. బహుశా.. ఇవన్నీ ఆగిపోతాయి కావొచ్చనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏమైనా ఎన్నికలకు ముందు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు… మిత్రపక్షం కోసం చురుగ్గా పని చేస్తోందనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.