న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై దూషణలకు పాల్పడిన కేసుల్లో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా… వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ.. ఎలాంటి పోస్టులు పెట్టాలి.. ఎవరిపై విమర్శలు చేయాలి.. ఎలాంటి విమర్శలు చేయాలన్నదానిపై.. సూచనలు ఇస్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన సూచనల కారణంగానే.. పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు న్యాయవ్యవస్థను బెదిరించేలా పోస్టులు పెట్టారని సీబీఐ భావిస్తోంది.
ఈ మేరకు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తను ప్రశ్నించినప్పుడు.. ఆధారాలు లభించాయని అందుకే.. గుర్రంపాటిని పిలిపిస్తున్నారని అంటున్నారు. గుర్రంపాటి దేవందర్ రెడ్డి.. ప్రస్తుతానికి ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్గా ఉన్నారు. కానీ ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ.. ఆయన మాత్రం వైసీపీ సోషల్ మీడియాకు పని చేస్తూఉంటారు. గతంలో న్యాయస్థానాలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించినప్పుడు అందరికీ తానున్నానని భరోసా ఇచ్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన భరోసాతోనే చాలా మంది రెచ్చిపోయారు. ఈ మేరకు దేవందర్ రెడ్డిని పొగుడుతూ వైసీపీ కార్యకర్తలు.. పోస్టులు కూడా పెట్టారు.
న్యాయమూర్తులపై దూషణలు.. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడానికి ఓ వ్యూహాత్మక సాధనంగా వాడుకున్నారని.. సీబీఐ అనుమానిస్తోంది. ఇది మొత్తం ఆర్గనైజ్డ్గా జరిగిందని భావిస్తున్నారు. ఇప్పుడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని సీబీఐ తనదైన శైలిలో విచారమ జరిపితే.. మొత్తం లింక్ దొరికే అవకాశం ఉంది. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.