సీబీఐ టాప్ టూ అధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాల మధ్య ఏర్పడిన వివాదం.. దావాలనంలా మారి… అన్ని వ్యవస్థలనూ చుట్టబెడుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, కేంద్ర మంత్రి హరిభాయ్, సీవీసీ కేవీ చౌదరిలకు అంటుకుంది. వీరి ముగ్గురిపై… రాకేష్ ఆస్థానా కేసును దర్యాప్తు చేసిన… సీబీఐ అధికారి మనీష్ కుమార్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థాలను ఉన్న పళంగా అర్థరాత్రి సెలవుపై పంపేసిన తర్వాత .. నరేంద్రమోడీ.. మన్నెం నాగేశ్వరరావుకు తాత్కాలిక సీబీఐ డైరక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన మొదటి పని… సీబీఐలో రాకేష్ ఆస్థానా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను… అండమాన్ వరకూ తరిమికొట్టడం. అలా బదిలీ చేసిన అధికారుల్లో ఒకరు మనీష్ కుమార్ సిన్హా .
తను రాకేష్ ఆస్థానా అవినీతిపై దర్యాప్తు చేస్తున్నప్పుడు… అజిత్ ధోవల్, కేంద్ర మంత్రి హరిభాయ్, సీవీసీ కేవీ చౌదరిలు దర్యాప్తును అడ్డుకోవాలని ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు.. సీబీఐ వ్యవహారాల్లో తన వాదన వినాలంటూ.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అస్థానా కేసును విచారిస్తున్న బృందం నుంచి తనను తప్పించాలనే ఉద్దేశంతోనే బదిలీ చేశారని సిన్హా ఆరోపించారు. తన వద్ద రాకేశ్ అస్థానా గురించి సంచలన పత్రాలు ఉన్నాయని సిన్హా సుప్రీంకోర్టుకు తెలిపారు. అస్థానాపై కేసు నమోదు చేస్తున్నట్టు ధోవల్‌కు అక్టోబర్ 17న సీబీఐ డైరెక్టర్ చెప్పారని మనీశ్‌కుమార్ ఆరోపించారు. అదే రోజు రాత్రి జాతీయ భద్రతా సలహాదారు ఈ విషయాన్ని రాకేశ్ అస్థానాకు చెప్పారని, తనను అరెస్టుచేయకుండా ఉండాలని ధోవల్‌ను రాకేశ్ అస్థానా కోరినట్టు సిన్హా చెబుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రికి ఈ ఏడాది జూన్ తొలిపక్షంలో ముట్టినట్టు మనశ్‌కుమార్ తన పిటిషన్లో పొందుపరిచారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరికి ఈ ఏడాది జూన్‌లో కొన్ని కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని.. కేంద్రమంత్రికి అహ్మదాబాద్ వాసి విపుల్ ద్వారా ముడుపు ముట్టినట్టు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే.. మొయిన్ ఖురేషీ కేసులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు సంబంధాలు ఉన్నట్టు సిన్హా కోర్టుకు చెబుతున్నారు. రాకేశ్ అస్థానా, డీఎస్పీ దేవేందర్‌పై దర్యాప్తులో ధోవల్ జోక్యం చేసుకున్నారంటున్నారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా ధోవల్ అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి, సీవీసీ చౌదరిని ప్రధాన సాక్షి సానా సతీశ్ దిల్లీలో కలిశారని కూడా చెబుతున్నారు.
ఈ వ్యవహారం మొత్తం సాన సతీశ్ చుట్టూ తిరుగుతోంది. సాన సతీశ్ వ్యవహారమంతా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలో లొసుగులన్నీ బయటపడేందుకు కారణమవుతున్నాయని, అంతకుముందు జరిగిన వ్యవహారాలు, పలువురు అధికారుల్లో వివిధ స్థాయిలో జరిపిన అవకతకవకలన్నీ దర్యాప్తు ద్వారా బయటకు వస్తాయని సిన్హా చెబుతున్నారు.ఈ వ్యవహాహాలన్ని చూస్తూంటే.. తీగ లాగుతూంటే.. డొంక కదులుతున్న చందంగా కనిపిస్తోంది. సిన్హా పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందనతో.. దేశంలో సంచలనం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.