వైఎస్ భాస్కర్ రెడ్డికి పన్నెండో తేదీన హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేశారు. ఆ ప్రకారం వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ రోజు పులివెందుల నుంచి పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చారు. కానీ అక్కడ సీబీఐ అధికారులు లేరు. ఇవాళ ప్రశ్నించడం లేదని… మరోసారి నోటీసులు జారీ చేస్తామని వైఎస్ భాస్కర్ రెడ్డికి చెప్పి పంపేశారు. దీంతో భాస్కర్ రెడ్డి మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. అరెస్టు చేసుకుంటే చేసుకోమనండి…తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాననని ప్రకటించారు.
సీబీఐ విచారణ కోసం ఈ రోజు పిలిచారని….ఆరోగ్యం సహకరించలేకపోయినా విచారణ కోసం వచ్చానని చెప్పుకొచ్చారు. ..అధికారి లేకపోవడంతో తిరిగి వెళుతున్నాను…మరోసారి నోటీసు ఇచ్చి పిలుస్తామన్నారన్నారు. విచారణను తప్పుదోవ పట్టించవద్దని .. వివేకా రాసిన లేఖ ఆధారంగానే హంతకులెవరో పట్టుకోవచ్చన్నారు. మొత్తంగా భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడానికి సీబీఐ ఆసక్తి చూపించలేదు. మంగళవారం అవినాష్ రెడ్డిని సీబీఐ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించినందున.. భాస్కర్ రెడ్డికి కూడా అదే రోజున హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అవినాష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం జరిగే విచారణ కీలకం కానుంది. అవినాష్ రెడ్డిని ఇంత కాలం చేసిన విచారణతో పాటు కేసు వివరాల ఫైల్ ను హైకోర్టుకు సీబీఐ సమర్పించనుంది. కోర్టు నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.