సీబీఐలో జరుగుతున్న సంచలన పరిణామాలకు మూలం హైదరాబాద్. హైదరాబాద్ కు చెంది సాన సతీష్ అనే వ్యక్తి…కథ అంతా నడిపారు. ఈ సంగతి తేల్చడానికి సీబీఐ ఇంచార్జి డైరెక్టర్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఓ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం హైదరాబాద్ చేరుకుంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా ల మధ్య చిచ్చు రేగడానికి కారణమైన సానా సతీష్ బాబు కేంద్రంగా ఢిల్లీ సీబీఐ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా నమోదైన ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కాంలో నిందితుడైన కోనేరు ప్రసాద్ ను బెయిల్ మీద బయటకు తెప్పించడం కోసం అప్పట్లో పెద్ద లాబీనే పనిచేసింది. కోనేరు ప్రదీప్ తన తండ్రి కోనేరు ప్రసాద్ ని జైలు నుంచి బయటకు రప్పించడం కోసం సీబీఐ బిగ్ బాస్ లను కలవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే సతీష్ బాబు ద్వారా అప్పటికే సీబీఐలో చక్రం తిప్పుతున్న మొయిన్ ఖురేషిని కలిశాడు. ఆ తర్వాత మొయిన్ ఖురేషి, కోనేరు ప్రదీప్ పలుమార్లు బ్లాక్ బెర్రీ మెసెంజర్ ద్వారా సంభాషణలు జరిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. ఈ కేసు బయటకు వచ్చినప్పుడు.. అప్పట్లో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మినారాయణను.. కోనేరు ప్రసాద్ కుమారుడు.. కుక్కగా అభివర్ణించిన విషయం బయటపడింది.
ఈ దందాకు సంబంధించి కీలక ఆధారాలు ఐటీ, ఈడీ సేకరించి అప్పట్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇదిలా ఉంటే ఎన్ఎండీసీ ని 160 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన కేసులో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ సుఖేష్ గుప్తా తరఫున మళ్లీ సతీష్ బాబు, మొయిన్ ఖురేషి లాబీయింగ్ ప్రారంభించారు. వీరితో నాటి కాంగ్రెస్ నాయకులు బొత్స, షబ్బీర్ అలీ జత కలిశారు. ఇందులో బొత్స సత్యనారాయణ పేరు కూడా ఉంది. ఏడేళ్ల కాలంలో ఒకో సీబీఐ అధికారి ఒకో రీతిన దర్యాప్తు జరిపారు. కొన్నాళ్లు అటకెక్కిన కేసు రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ విభేదాలతో మళ్లీ వెలుగులోకి వచ్చి సీబీఐనే షేక్ చేయడానికి కారణమైంది.
సీబీఐ పెద్దలోత నేరుగా డీల్స్ చేసుకున్న ఖురేషితో సన్నిహిత సంబంధాలున్న సతీష్ బాబు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, అస్థానా బృందాలకు వేర్వేరు వాంగ్మూలాలు ఇచ్చి వారిని చిక్కుల్లో పడేశాడు. ఇప్పుడు అదే సతీష్ బాబు లింకులు తెలుసుకోవడం కోసమే సీబీఐ ప్రత్యేక బృందం హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరిపై దాడులు జరుగుతాయో వేచి చూడాలి..!