వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను ప్రశ్నిస్తున్నారు. ఇనయతుల్లా వివేకాకు వ్యక్తిగత కార్యదర్శిగా, ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. హత్య జరిగినప్పుడు వివేకా ఇంట్లోకి తొలుత వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహానికి ఫొటోలు, వీడియోలను ఇనయతుల్లానే తీశారు. అతడి మొబైల్ ఫోన్ ద్వారానే ఇతరులకు ఫొటోలు షేర్ చేశారు. వీటన్నింటిపై గతంలోనే వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రస్నిస్తున్నాయి.
మరో వైపు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంకులు సృష్టిస్తున్నందున దానిని హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. సీబీఐ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గత వారం వివేకా కేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన ప్రైవేటు పిటిషన్లు కొట్టేయాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు నిందితుల్ని పిలిస్తే తమపైనే కేసులు దాఖలు చేస్తే ఇక వివేకా కేసులో దర్యాప్తు ముందుకు సాగదని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తేల్చిచెప్పేశారు. దీనిపై 22వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.
ఈ క్రమంలో సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. సీబీఐ అధికారులు సుదీర్గంగా విచారణ జరుపుతున్నారు. కానీ కీలక నిందితులని .. సూత్రధారుల్ని మాత్రం అరెస్ట్ చేయలేదు. వారెవరో సీబీఐ స్పష్టం తెలుసుకున్నా అరెస్ట్ చేయలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కాగానే సీబీఐ మళ్లీ హడావుడి ప్రారంభించింది.