రెండున్నర నెలలుగా సీబీఐ అధికారులు పులివెందుల, కడపల్లో విచారణ జరుపుతున్నారు. సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాకు సమాచారం లీక్ చేశారు. ఇక నేడో రేపో కేసు ఛేదిస్తారని అనుకుంటున్న సమయంలో చేతులెత్తేస్తున్నట్లుగా పేపర్ ప్రకటన ఇచ్చారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని పేపర్లలో సీబీఐ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన చూసి జనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
వివేకా హత్య కేసులో నిందితుల ఎవరో బహిరంగ రహస్యం అనేది కడప, పులివెందులలో అందరికీ తెలుసు. దారుణమైన హత్యను గుండెపోటుగా నమ్మించడానికి ప్రయత్నించారు.. సాక్ష్యాలు తుడిపేయడానికి ప్రయత్నించారు. ఇంత స్పష్టంగా కళ్ల ముందు నిందితులు కనిపిస్తున్నా సీబీఐ ఇంత వరకూ వారి జోలికి వెళ్లలేదు. ప్రశ్నించలేదని అంటారని.. ఎప్పుడో ఒక సారి కీలక నిందితుల్ని పిలిచి కూర్చోబెట్టి పంపిస్తున్నారు. సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత చాలా కీలక పరిణామాలు ఉంటాయని అనుకున్నారు. కానీ ఏమీ లేవు. పేపర్ ప్రకటనతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు .. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు బాధ్యతల్లో ఉన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్గా మొత్తం ఆయనే ఆ కేసును పరిశీలించారు. ఆ కేసులో మొత్తం ఏం జరిగిందో… నిందితులు ఎవరో సమాచారం అప్పటికే ప్రొడ్యూస్ చేశానని.. అది సీబీఐ వరకూ రాకపోతే తాను మళ్లీ ఇస్తానని పదే పదే సీబీఐకే లేఖలు రాశారు. కానీ సీబీఐ పట్టించుకోలేదు. కానీ అలా అన్నందుకు ఆయనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీబీఐకి నిజంగానే సమాచారం కావాలనుకుంటే ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం సరిపోదా..? అంత కంటే నమ్మకమైన సమాచారం కావాలా..? అనే సెటైర్లు సహజంగానే వస్తాయి.